నిజానికి పవన్, మహేష్ అభిమానుల మధ్య విపరీతమైన పోటీ ఉండవచ్చు గానీ వీరిద్దరి విషయంలో ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరు బాగా సిగ్గరులు. పెద్దగా మాట్లాడరు. తమ పనేంటో తాము చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు డ్యాన్స్‌లలో వీక్. ఇక పవన్ ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చాడు కాబట్టి విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే గానీ మహేష్ మాత్రం వివాదాలకు ఆమడదూరంలో ఉంటాడు. ఇక పవన్ రాజకీయ పంధా ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. మరో పక్క మహేష్ రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే లేదు. సినిమాలతో పాటు పవన్ సామాజికసేవ, రాజకీయాలలో బిజీగా ఉంటే.. మహేష్ మాత్రం తన సినిమాలు, ఫ్యామిలీ, సామాజిక సేవ, బ్రాండ్ అంబాసిడర్‌గా ముందుకెళ్తున్నాడు. అయితే పవన్ చిత్రం ఫ్లాపయినా కూడా ఓపెనింగ్స్‌తోనే 50కోట్ల మార్కును దాటుతోంది.
కానీ మహేష్ సినిమాలకు మాత్రం ఫ్లాప్ టాక్ వస్తే డిజాస్టర్స్‌గా మిగిలిపోతున్నాయి. దీనికి 'బ్రహ్మూెత్సవం, స్పైడర్'లే ఉదాహరణ. ఇక మహేష్, పవన్‌లు ఇద్దరు ఇప్పుడిప్పుడే సోషల్‌మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. మహేష్‌కి డిజాస్టర్స్ వచ్చినా కూడా ఆయన బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఆయన నిజాయితీగా తన ఫ్యాన్స్ చాలా మంచి వారని, సినిమా బాగుంటేనే చూస్తారు గానీ బాగా లేకపోతే హడావుడి చేయరని చెప్పాడు. ఇలా డిజాస్టర్స్ వస్తున్నా కూడా మహేష్‌ని తన ప్రోడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలని పలు కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతుండటం విశేషం.
ఇక ట్విట్టర్‌లో కూడా ఈ మధ్య మహేష్‌తో పాటు ఆయన శ్రీమతి నమ్రతా యాక్టివ్‌గా ఉంటోంది. దీంతో తాజాగా మహేష్ ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య ఐదు మిలియన్లకు చేరింది. తెలుగు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలలో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్‌ని సంపాదించుకున్న స్టార్‌గా మహేష్ మొదటి స్థానంలో నిలిచాడు. సినిమా జయాపజయాలకు అతీతంగా ఫ్యాన్స్‌ని పెంచుకుంటున్న మహేష్‌ని చూస్తే ఆయన స్టార్ కాదు.. ఆయనో బ్రాండ్ అని అర్ధమవుతోంది.