నిజమే.. ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి అభిరుచి పెరుగుతోంది. వారు నేల విడిచి సాము చేసే సూపర్‌మ్యాన్ తరహా స్టార్స్ చిత్రాల కంటే... హీరోల కంటే.. నేచురల్‌గా మన పక్కింటి అబ్బాయిలా కనిపించేవారినే బాగా ఇష్టపడుతున్నారు. దానికి నాని, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నిఖిల్ వంటివారే ఉదాహరణ. ఇదే విషయం నాని కూడా ఒప్పుకున్నాడు. నాని హీరోగా 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా వేణుశ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'ఎంసీఎ' చిత్రం 21వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ వరంగల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతోంది. కాబట్టి ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను కూడా వరంగల్‌లోనే జరిపారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్ట్ చూస్తుంటే ప్రస్తుతం ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయ్యాడనిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం వరంగల్‌లోనే చేశాం. ఇంటిని వదిలి వరంగల్‌లోనే బస చేశాం. కానీ మాకు మా ఇంటిని వదిలివచ్చామనే ఫీలింగే కలగలేదు. అలా మమ్మల్ని ఎంతో అపురూపంగా మీరు చూసుకున్నారు. 'ఎంసీఏ' చిత్రం నాకు స్పెషల్ మూవీ అయిపోయింది. నాకు, మా సినిమాకి సహకరించిన వారికందరికీ కృతజ్ఞతలు.. అని తెలిపాడు.
ఇక 'ఎంసీఏ' ట్రైలర్ మాత్రం పెద్దగా కొత్తదనం లేకుండా మామూలు రొటీన్ సినిమాలానే సాగుతున్న ఫీలింగ్‌ని కలిగిస్తోంది. దీంతో ఈ చిత్రం ట్రైలర్, పాటలు విడుదల కాకముందు ఈ చిత్రానికి ఉన్న పాజిటివ్ బజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇక నానికి, దిల్‌రాజుకి ఓవర్‌సీస్‌లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఓవర్‌సీస్‌లో కూడా ఈ ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని, దాంతో ప్రీమియర్ షోలకు, ఓపెనింగ్స్‌కి పెద్దగా హడావుడి కనిపించడం లేదు. మరో వైపు దేవిశ్రీప్రసాద్ నుంచి ఇటీవల వచ్చిన అన్ని ఆల్బమ్స్‌లోకి 'ఎంసీఏ' చిత్రమే డల్‌గా ఉందనే ఫీలింగ్‌ని కలిగిస్తోంది. మరోవైపు 'హలో' ఆడియోకి అనూప్ రూబెన్స్, 'అజ్ఞాతవాసి'కి అనిరుద్‌లు ఇచ్చిన ట్యూన్స్ మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. మరి మన మిడిల్ క్లాస్ అబ్బాయి తన కిందటి చిత్రాల రేంజ్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే దిల్ రాజు, నాని, సాయి పల్లవిల మ్యాజిక్.. ఈ సినిమాని మిడిల్ లో వదిలేయకుండా రిచ్ గా చేర్చుతుందేమో చూద్దాం.