'బాహుబలి-ది బిగినింగ్'తో పాటు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలలో ప్రభాస్, అనుష్క వంటి వారినే కాకుండా రమ్యకృష్ణ, సత్యరాజ్, వంటి మన అర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతోనే ప్రభంజనం సృష్టించాడు రాజమౌళి. దాదాపు తమన్నా, రానా వంటి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపు ఉన్నవారే తప్పితే బాలీవుడ్ కోసమని స్పెషల్‌గా ఆక్కడి స్టార్స్‌ని రాజమౌళి తీసుకురాలేదు. కానీ ప్రభాస్, అనుష్క వంటి వారికే ఉత్తరాది ప్రేక్షకులు కూడా 'బాహుబలి'కి బ్రహ్మరథం పట్టారు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో మెగా మల్టీస్టారర్ మూవీని దాదాపు తీయడం ఖాయమనే వినిపిస్తోంది. కథ కూడా దాదాపు ఫైనల్ స్టేజీకి వచ్చిందని అంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని ఆయన కేవలం తెలుగులోనే తీస్తాడా? లేక 'బాహుబలి'లాగా ఇతర భాషల్లోకి కూడా అనువాదం చేసి రిలీజ్ చేస్తాడా? అనే విషయంలో టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ ప్రముఖులలో చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ మల్టీస్టారర్ ఎలాంటి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లతో పనిలేని కథనే తెరకెక్కించనున్నాడు. దాంతో ఈచిత్రంలో బాలీవుడ్ వారిని ఆకర్షించేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్లనే ఎంపిక చేయనున్నాడని తెలుస్తోంది. మొదట్లో ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోందని వార్తలు వచ్చినా అది నిజం కాదని సమాచారం.
తనకు ఇతర భాషలు, బాహుబలితో వచ్చిన బాలీవుడ్ క్రేజ్‌ని, ఇమేజ్‌ని నిలబెట్టుకునేలా ఈ చిత్రాన్ని కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేయమని పలువురు సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తుండటంతో ఆయన కూడా దానికి సుముఖంగానే ఉన్నాడని తెలుస్తోంది. ఇక 150కోట్ల బడ్జెట్‌తో రూపొందే చిత్రం కాబట్టి మిగిలిన భాషల్లో విడుదల చేయడం కూడా గ్యారంటీ అంటున్నారు. ప్రభాస్‌ని 'బాహుబలి'తో నేషనల్ స్టార్‌ని చేసినట్లుగానే ఈ మల్టీస్టారర్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. ఆల్‌రెడీ రామ్‌చరణ్ బాలీవుడ్‌లో 'జంజీర్' చేసినా డిజాస్టర్ అయింది. సో.. ఈ రాజమౌళి చిత్రం రామ్‌చరణ్‌కి బాలీవుడ్‌లో రీలాంచింగ్ మూవీగా, ఎన్టీఆర్‌కి ఎంట్రీ మూవీగా నిలవడం ఖాయమంటున్నారు.