అటు బాలయ్య తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ , వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్‌ల విషయంలో అడ్డుచెప్పని లక్ష్మీపార్వతి తాను తీయబోయే 'లక్ష్మీస్ వీరగ్రంధం' విషయంలో ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని ఈ చిత్రం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డాడు. నా కారణంగానే లక్ష్మిపార్వతి నిజ స్వరూపం ఏమిటో జనాలందరికీ తెలిసిందని చెబుతూ, నన్ను రోడ్‌సైడ్ వ్యక్తి, బజారు మనిషి, రౌడీ అంటున్నావు. నువ్వేమైనా రాజమహల్ నుంచి వచ్చావా? నీవు నన్ను రోడ్డు మనిషి అన్న మాటలకు నీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఉంది. కానీ అన్న ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే మౌనంగా ఉన్నాను.
నన్ను చెన్నై నుంచి తమిళులు, తెలుగు వారు తరిమివేస్తే వచ్చానని అంటున్నావు. నేను చెన్నైలో వడివేలునే కొట్టడానికి ఆయన ఇంటికి వెళ్లిన వ్యక్తిని. వడివేలే నన్నేమి చేయలేకపోయాడు. తెలుగు వారి కోసం నాటి జయలలిత మీదనే ఆమెను విమర్శిస్తూ మాట్లాడిన వాడిని నేను, నన్ను తరమివేసే సీన్ ఎవ్వరికీ లేదు. ఇక లక్ష్మీపార్వతి తన గురించి చిత్రం తీయవద్దంటోంది. ఎన్టీఆర్ సతీమణిగా మీరంటే నాకు గౌరవం ఉంది మరి నేను సినిమా తీస్తానంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? లక్ష్మీపార్వతి మీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పడానికి సిద్దమే.. ఎక్కడికి రమ్మంటారు?
మీ సొంత ఊరికైనా, మీ భర్త వీరగ్రంధంకి చెందిన మెట్టినూరుకైనా నేను వస్తాను. మీరు రెడీనా...? నా సినిమాని అడ్డుకుంటానని అంటున్నారు? ఎలా అడ్డుకుంటారు? మీరేమైనా మీ జీవిత చరిత్ర రాసి రిజిష్టర్ చేయించారా? లక్ష్మి పేరుతో దేశంలో కోట్ల మంది ఉన్నారు. ఇక లక్ష్మీపార్వతి జీవితంలో జరిగిన ఘటనలు కూడా ఎందరి జీవితాలలోనో జరిగి ఉన్నాయి. ముసలి వయసులో చేదోడు వాదోడు కోసం ఎందరో ఆ వయసులో పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు. వారి వివరాలను కావాలంటే సెన్సార్‌కి, కోర్టుకి చూపించడానికి నేను రెడీ అంటూ ఆయన లక్ష్మీపార్వతికి బహిరంగ సవాల్ విసిరారు.