సామాన్యులు తమ పాత జీవితంలో జరిగిన మధురజ్ఞాపకాలను, నాటిరోజల్లో తాము ఎలా ఉండే వారిమి? చిన్ననాడు స్నేహితులతో ఎంజాయ్ చేసిన రోజులు, హ్యాపీడేస్, స్కూల్, కాలేజీ రోజుల వంటి వాటిని ఫొటోల రూపంలో పదిలపరుచుకుని కొన్నింటిని మనసులోనే నాటుకునేలా చేస్తారు. కానీ సినీ నటులకు మాత్రం పాత రోజులు గుర్తుకు రావాలన్నా, నాడు తాము ఎలా ఉన్నామో చూడాలన్నా కూడా వారి పాత చిత్రాలు, నాటి రోజుల్లో జరిగిన ఘటనలు మదిలో ఉంటాయి. భావితరాల వారికి కూడా వారు సినిమాల రూపంలోనే గుర్తుండిపోతారు.
ఇలాంటి ఓ సంఘటనను తాజాగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నెమరు వేసుకున్నాడు. 1990లో లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో తాను, శ్రీదేవి, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లు కలసి 'జుమ్మా.. చుమ్మా.. దేదే' అనే పేరిట నిర్వహించిన కాన్సర్ట్‌లో పాల్గొన్నామని, శ్రీదేవి, అమీర్, సల్మాన్‌లకు అదే మొదటి కాన్సర్ట్ అని తెలిపాడు. అప్పటికి 'హమ్' చిత్రంగానీ, ఆ పాట కానీ ఇంకా విడుదల కాలేదు. నాడు తాను శ్రీదేవితో కలసి 'జుమ్మా.. చుమ్మా..దేదే' పాటకు డ్యాన్స్ చేశామని అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పాట నాడు సంగీత ప్రియులను ఉర్రూతలూగించి, ఓ సంచలనం సృష్టించింది. నాటి సంగీత ప్రియులు ఆ పాట విని మైమరిచిపోయేవారు.
అదే పాటను హమ్ చేస్తూ, ఆటోమేటిగ్గా ఆ పాటకి తగ్గట్లుగా లయబద్దంగా తమకు తెలియకుండానే కదిలిపోయేవారు. ఆ తర్వాత ఈచిత్రం 1991లో విడుదలైంది. ముకుల్. ఎన్.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిమికట్కర్ హీరోయిన్ కాగా రజనీకాంత్, గోవిందాలు ముఖ్యపాత్రలు పోషించారు.