ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో పర్యటించిన జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం నుంచి ప్రత్యేకహోదా వరకు, కృష్ణానది మృతుల నుంచి కాంట్రాక్ ఉద్యోగులు, ఫాతిమా విద్యార్ధుల వరకు స్పందించి ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే దేని మీదైనా స్పందించేందుకు సిద్దమని తెలిపాడు. ఇక పవన్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఘాటుగానే స్పందించారు. ఇక టిడిపి నాయకులతో పాటు చంద్రబాబు కూడా పవన్‌ని ఉద్దేశించి ఏదైనా మాట్లాడే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని చురకలు వేశాడు. ఇక పవన్ తన ప్రసంగాలలో వైసీపీ అంటే తనకు భయమని, అవినీతి సొమ్ముతో కోట్లు సంపాదించిన వారు నాయకులైతే ఆ ప్రభావం సమాజంపై ఉంటుందని చెప్పాడు.
ఇక ప్రతిపక్షపార్టీగా జగన్ విఫలమవ్వడంతో ఆయన చేయాల్సిన పనులను తాను చేయాల్సివస్తోందని వ్యాఖ్యానించాడు. అయితే ప్రతి చిన్న విషయానికి మీడియా ముందు ముఖ్యంగా తమ సొంత మీడియాలో విమర్శలు కురిపించే వైసీపీ నాయకులు పవన్ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. మొదట్లో రోజా కాస్త స్పందించినా ఆ తర్వాత ఎవ్వరూ పవన్ మాటే ఎత్తడం లేదు. ఇప్పుడు పవన్‌ని విమర్శిస్తే పవన్ మరలా తమకు కౌంటర్ ఇస్తాడని, దాంతో వార్ మొత్తం తమ ఇద్దరి మధ్యనే సాగడం వైసీపీ నాయకులకు ఇష్టం లేదు. పవన్ ఎలాగూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన విషయంలో కాస్త ఆచితూచి స్పందించే విధంగా వైసీపీ నాయకులు నడుచుకుంటున్నారు.
ఇక పవన్‌ని విమర్శిస్తే ఓటు బ్యాంకు దృష్ట్యా కూడా అది తమకే మైనస్ అవుతుందనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాల తప్పుడు విధానాలపై జనసేన తమతో కలిసి వస్తే వారితో చేతులు కలిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని కూడా ప్రకటించాడు. ఇక వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న ప్రశాంత్ కిషోర్ కూడా పవన్‌పై విమర్శలు చేయడం వల్ల తమకే కాస్త మైనస్ అవుతుందని, కాబట్టి మౌనంగా ఉండాలని సూచించడంతో వైసీపీనేతలు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది.