పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ ని పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ప్రమోషన్స్ లో పాల్గొంటాడో లేదో అనే డైలామాలో చిత్ర బృందం వుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతగా బిజీగా వున్నా కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లో పాల్గొనబోతున్నాడట. ఇప్పటికే అజ్ఞాతవాసికి సంబంధించిన రెండు పాటలు మార్కెట్ లోకి విడుదలై అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటున్నాయి.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న అజ్ఞాతవాసి పాటల వేడుక ఈ నెల 19 న జరపతలపెట్టగా.. హైదరాబాద్ లో తెలుగు మహాసభలు చివరి రోజు కావడం.. అతి పెద్ద ఆడియో వేడుకకి అనుమతి లభిస్తుందో లేదో అనే సంకటంలో చిత్ర బృందం ఉండగా.. ఒకవేళ 19 కాకపోతే 20, 21 న గాని ఈ ఆడియో వేడుకని హెచ్ఐసిసిలో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఆడియో వేడుకకి చాలామంది సెలబ్రిటీస్ హాజరవుతారని చెబుతున్నారు. మరో పక్క అజ్ఞాతవాసి ఆడియోకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కోసం చిరు అజ్ఞాతవాసి ఆడియో వేడుకకి హాజరవుతాడని సమాచారం. ఇక చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్న ఈ ఆడియోకి ఇంకెంతమంది మెగా హీరోలు వస్తారనేదాని మీద స్పష్టత లేదు. ఇకపోతే జనవరి 10 న విడుదల కానున్న అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తుండగా.. ఖుష్బూ, ఇంద్రజ వంటి సీనియర్ హీరోయిన్స్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.