తన చిత్రాల విడుదలకు ముందు సహజంగా కంగనారౌనత్ ఏదో ఒక వివాదం మొదలుపెట్టి వాటితో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇక 'క్వీన్' నుంచి ఆమె ఆ డోస్‌ని మరింతగా పెంచింది. ఇక ఇటీవలి కాలంలో ఈమె తన సినిమాల విడుదల సమయంలో హృతిక్‌రోషన్ వివాదాన్ని తరచుగా తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్‌గా 'మణికర్ణిక'లో నటిస్తోంది. ఇక ఈమె కంటే ఈమె సోదరి మరింతగా తన అక్క మీద ఈగ వాలినా కూడా నానా హంగామా చేసి తన సోదరికి కావాల్సినంత ప్రమోషన్‌ని ఇస్తూ ఉంటుంది.
సాధారణంగా మహిళలు, అందునా హీరోయిన్లు దర్శకులు, నిర్మాతలు, హీరోలైన మగవారిపై ఏమైనా తేడాగా మాట్లాడితే పాపం ఆడది అనే జాలితో అందరు తప్పు ఎవరి వైపు నుంచి ఉన్నా కూడా హీరోయిన్లకే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండటం సహజం. ఇది కేవలం సినిమాలలోనే కాదు.. నేటి సమాజంలో అందునా ఇండియాలో ఇప్పుడు అందరూ ఆడవారి మీద జాలి చూపించనంతగా మగవారిపై చూపించరనేది వాస్తవం. కానీ కంగనారౌనత్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది. ఎక్కువ మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో హృతిక్‌కే మద్దతు తెలిపారు. బాలీవుడ్ మహిళా ప్రముఖులు కూడా హృతిక్ తప్పేమి లేదని తేల్చారు. కానీ కంగనా మాత్రం ఈ విషయాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.
తాజాగా ఆమె 'ఫిట్ టు ఫైట్' కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ సాగిన కార్యక్రమంలో.. నా సోదరి కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయి ఆమెపై యాసిడ్ దాడికి ప్రయత్నించాడు. ఇక నన్ను ఓ సూపర్‌స్టార్ జైలుకి పంపడానికి కుట్రలు పన్నుతున్నాడని వ్యాఖ్యానిస్తూ అన్యాపదేశంగా, ఇన్‌డైరెక్ట్‌గా మరోసారి హృతిక్‌ని టార్గెట్ చేసింది. సమాజంలో ఇలాంటివి సహజమైపోయాయని చెబుతూనే, వాటిని ఎదురొడ్డి నిలవాలని మహిళలకు ఈమె పిలుపునిచ్చింది. కాగా ఇప్పటికే హృతిక్ కంగనా తనను లైంగికంగా వేధించి, పలు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టిందని ఆల్‌రెడీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే కంగనా మరోసారి తేనెతుట్టెను కదిపింది!