వాస్తవానికి నేటి రోజుల్లో యంగ్ హీరోల మధ్య మంచి పోటీ ఉంది. కానీ విలన్ వేషాలు వేసే ఆర్టిస్ట్‌ల సంఖ్య తగ్గిపోతోంది. దాంతో యంగ్ హీరోలు కూడా ఇప్పుడు విలన్ పాత్రలు చేయడానికి మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే హీరోలుగా ఫేడవుట్ అవుతున్న వారు కూడా విలన్లుగా మారుతున్నారు. అరవింద్‌స్వామి, జగపతిబాబు, శ్రీకాంత్ నుంచి ఆది పినిశెట్టి వరకు ఇదే దారిలో నడుస్తున్నారు. ఇక నేటి దర్శకులు కూడా హీరోల పాత్రలకు పోటీగా విలన్ల పాత్రలను కూడా తీర్చిదిద్దుతుండటం శుభపరిణామం. మంచి ప్రతినాయకుని పాత్ర ఉంటేనే హీరో పాత్ర మరింత ఎలివేట్ అవుతుందనే సత్యాన్ని నేటి దర్శకులు అనుసరిస్తున్నారు. ఇలా వచ్చిన మరో వర్దమాన విలన్ సిద్దార్ద్ శంకర్.
ఈయన పుట్టింది.. పెరిగింది అంతా మలేషియాలోనే. ఈయన తండ్రిది వేలూర్‌కాగా అమ్మది మలేషియా. మంచి అందం, టాలెంట్ ఉండి విలన్ పాత్రలకు సరిగ్గా సూట్ అవుతాడనిఫ్రెండ్స్ అంటూ ఉంటే ఆయనకి కూడా సినిమాలపై మోజు ఏర్పడింది. కానీ ఆయన తల్లి సినిమాలు వద్దని చదువుమీదనే దృష్టి పెట్టాలని ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో ఎంబీబీఎస్ చేశాడు. కానీ నటనపై ఉన్న ఆసక్తితో డాక్టర్‌చదువును మద్యలోనే మానేసి చెన్నై వచ్చాడు. ఈయన వెళ్లే జిమ్‌కే సంగీత దర్శకుడు నుంచి హీరోగా మారిన విజయ్ ఆంటోని వచ్చేవాడు. దాంతో ఈయన విజయ్‌ఆంటోనిని కలిసి తనకేమైనా చాన్స్ ఉంటే ఇవ్వమని అడిగాడు. ఆయనకు సిద్దార్ద్‌శంకర్ టాలెంట్ నచ్చడంతో 'సైతాన్' చిత్రంలోని మెయిన్ విలన్ పాత్రను ఆయనకిచ్చాడు. ఈ చిత్రంలో ఆయన ప్రతిభ చూసి మరో రెండు మూడు అవకాశాలు వచ్చాయట.
ఇక తాజాగా ఆయన ప్రముఖ సీనియర్ హీరో సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ నటించిన 'సత్య' చిత్రంలోని పాత్రను దక్కించుకున్నాడు. ఈ చిత్రం తెలుగులో వచ్చిన 'క్షణం'కి రీమేక్‌గా రూపొందింది. ఇందులో సిద్దార్ద్‌శంకర్ పోషించిన విలన్ పాత్రకు మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఇందులో ఆయన రమ్యనంభీసన్‌కి జోడీగా నటించాడు. ఇందులోని ఆమెని కౌగిలించుకునే సీన్లలో ఈయన బాగా మొహమాట పడ్డాడట. దాంతో రమ్యనంబీశనే తనకు గట్టిగా గుచ్చుకోకుండా సున్నితంగా ఎలా కౌగిలించుకోవాలో ఈ నటుడిని చెప్పి, ఎన్నో చిట్కాలు చెప్పిందట. ఇక తనకు విలన్ పాత్రలంటేనే ఇష్టమని, ఇలాంటి పాత్రలైతేనే వేరియేషన్స్‌ని చూపించే స్కోప్ ఉంటుందని చెబుతున్న సిద్దార్ద్‌శంకర్ తనకు ఒకప్పటి రఘువరన్‌లా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందనే కోరిను వెలిబుచ్చాడు.