సునీల్ తర్వాత హీరోలకు, మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకు స్నేహితుని పాత్రలు చేస్తూ ఆ స్థానాన్ని తాను స్వంతం చేసుకుని సునీల్ ప్లేస్‌ని రీప్లేస్ చేసిన కమెడియన్ వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఈయనకు ఉన్న డిమాండ్ మరే కమెడియన్‌కి లేదంటే అతిశయోక్తి కాదు. తన పాత్రలను ఎంతగానో ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రోజు కాల్షీట్స్ కింద రెండు నుంచి మూడు లక్షలు పైగానే వసూలు చేస్తున్నాడనే ప్రచారం ఉంది. సునీల్ హీరోగా మారిపోవడం, సప్తగిరి కూడా అదే దారిలో నడుస్తుండటం, బ్రహ్మానందం వయసు మీరుతుండటం, అలీ కొన్ని చిత్రాలకే పరిమితమవుతూ, సీనియర్‌గా మారిపోవడంతో యూత్ కమెడియన్ స్థానాన్ని వెన్నెల కిషోర్ భర్తీ చేస్తున్నాడు.
ఇక ఈయన కేవలం కామెడీనే కాదు నవరసాలను పోషించగలనని నిరూపించుకున్నాడు. ఏడిపిస్తూనే నవ్వించడం వంటివి కూడా చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో ప్రభాస్‌కి స్నేహితునిగా ఓ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రను చేస్తున్నాడట. ఎలాంటి పాత్రలోనైనా తనదైన టైమింగ్‌తో కామెడీని పండించడంలో దిట్ట అయిన వెన్నెల కిషోర్ పాత్ర ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక 'సాహో'కి సంబంధించిన ప్రతి విషయాన్ని చిత్ర యూనిట్ బయటకురాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.
యువి క్రియేషన్స్ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను కరణ్‌జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇక ఇందులో నీల్‌నితేష్ ముఖేష్, మందిరాబేడీ, అరుణ్‌విజయ్, జాకీష్రాఫ్ వంటి హిందీ, తమిళ నటులు నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మూడు భాషల్లోనూ వెన్నెల కిషోరే ఆ పాత్రను చేయనున్నాడా? లేక తమిళం, హిందీలలో ఆ పాత్రను వేరేవారిచేత చేయించనున్నారా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.