'మౌనపోరాటం, సూరిగాడు, మామగారు, పుట్టింటి పట్టుచీర' తదితర చిత్రాలలో హెవీ ఎమోషనల్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యమున. కాగా ఈమె ఆనాడు మంచి చిత్రాలను చేసినా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్‌తో మాత్రం నటించలేకపోయింది. ఇక 'కొదమసింహం' సమయంలో అందులోని ఓ పాత్ర కోసం యమునని అనుకున్నారట. ఇక బాలకృష్ణ చిత్రంలో కూడా అవకాశం వచ్చి చేజారి పోయిందని ఆమె తెలిపింది.
ఇక తాను మోహన్‌బాబు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అల్లుడుగారు' చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్ర మొదట తనకే వచ్చిందని, కానీ పాత్ర నిడివి గురించి ఆలోచించానే గానీ రాఘవేంద్రరావు, మోహన్‌బాబు వంటి వారితో కలిసి నటిస్తే ఎంతటి గుర్తింపు వస్తుంది అనే విషయం అర్దం చేసుకోలేక తాను ఆ సినిమాని వదులుకుని పెద్ద తప్పు చేశానంటోంది. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు కూడా వినూత్న కథలలో, ఎవరిశైలిలో వారు మెప్పిస్తున్నారని, తనకు మంచి పాత్రలు వస్తాయనే నమ్మకంతో ఎదురు చూస్తున్నానని, పాత్ర పరిధి చిన్నదైనా దానిలో మేజిక్ చేయగలిగిన సత్తా ఉంటే తాను అలాంటి పాత్రలను ఖచ్చితంగా చేస్తాను.
ఇక నాకు నిజంగా జెలసీ లేదు. కానీ ప్రకాష్‌రాజ్ గారిని చూస్తే మాత్రం జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అన్ని తరహా పాత్రలు వస్తున్నాయి. ఆలాంటి పాత్రలు నటీమణులకు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆయనలా ప్రతి తరహా పాత్రను చేయాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె ఈటీవీలో 'విధి'కి సీక్వెల్‌గా వస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీరియల్‌లో లీడ్‌రోల్‌ని పోషిస్తున్న సంగతి తెలిసిందే.