బయోపిక్‌లు తీయాలంటే మామూలు కమర్షియల్ చిత్రాల కంటే దాదాపు 100రెట్లు కష్టపడాలి. వారి జీవిత విశేషాలు, వారి కాస్ట్యూమ్స్, వారి పెర్ఫార్మెన్స్ నుంచి ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం వారి బయోగ్రఫీని రీసెర్చ్ చేయడం, నటీనటుల ఎంపికతోనే సరిపోదు. సంగీతం, సాహిత్యం, సెట్స్, లోకేషన్లు, నాటి వాతావరణం, నాడు వారు వేసిన కాస్ట్యూమ్స్ వరకు ప్రతిది కత్తి మీద సామే. ఇక ఇప్పటివరకు సావిత్రి జయంతులను, వర్ధంతులను మన సినిమా పెద్దలే కాదు ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. అలాంటిది సావిత్రి మీద బయోపిక్‌గా 'మహానటి' వస్తుండటంతో ఆమె జయంతి రోజున అందరిలో ఆసక్తి మొదలైంది.
ఒకవైపు చూస్తే భారీ తారాగణం, అశ్వనీదత్ నిర్మాత, ఆయన అల్లుడు నాగ్ అశ్వినే దర్శకుడు కావడంతో ఈ చిత్రం అప్‌డేట్ కోసం అందరు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పటివరకు ఈచిత్రం టైటిల్ 'మహానటి' అని తెలిసిందేగానీ టైటిల్ లోగో ఎలా ఉంటుందో మాత్రం క్లూ రాలేదు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌లోగో యానిమేషన్‌ని టీం విడుదల చేసింది. కానీ ఈ చిత్రం లోగోని చూస్తే ఏదోమాస్ చిత్రం టైటిల్ తరహాలో డిజైన్ చేశారు. ఇక ఈ టీజర్ చివరలో ఏదో పవన్, చిరంజీవి, ఎన్టీఆర్‌లు నటించే మాస్ చిత్రంలాగా 'మహానటి... మహానటే' అనే అరుపులు నిండిపోయాయి.
దీనిలో 'మాయాబజార్'లోని మాయాపేటికను తెరిచినట్లుగా చూపించి అందులోంచి టైటిల్‌లోగో వచ్చే విధంగా చేశారు. ఇక 'అది ప్రియదర్శిని వదిన..ఆ పేటిక తీసి చూస్తే అనే డైలాగ్‌తో ప్రారంభించారు'. 'అలిగినవేళనే చూడాలి..నాకు జీవించడానికే ఇష్టం లేదు.. నన్ను వదిలి నీవు పోలేవులే.. అంటూ సావిత్రి జీవితంలోని మధురఘట్టాలను ఆవిష్కృతం చేశారు'. అంతాబాగానే ఉంది కానీ దీనికి ఇచ్చిన రీరికార్డింగ్ వింటే మాత్రం అప్పటివరకు ఉన్న మూడ్‌ని పోగొట్టి నిరాశపరిచింది. మరి ఈ విషయం నాగ్‌అశ్విన్ గుర్తించి సినిమాలో ఇలాంటి పొరపాట్లు రాకుండా శ్రద్ద తీసుకుంటే మంచిది...!