తమిళనాటే కాదు... తెలుగునాట కూడా విలక్షణ దర్శకునిగా, అభిరుచి ఉన్న నిర్మాతగా గౌతమ్ వాసు దేవ మీనన్‌కి మంచి పేరుంది. ఆయన తెలుగులో కూడా వెంకటేష్‌తో 'ఘర్షణ' 'ఎటో వెళ్లిపోయింది మనసు, ఏమాయ చేశావే.. సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఆయన విక్రమ్ హీరోగా 'దృవనక్షత్రం' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే యూనిట్ బల్గేరియా వెళ్లి కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుని వచ్చింది. మరోవైపు ఆయన సందీప్‌కిషన్ హీరోగా 'నరకాసరుడు' చిత్రం నిర్మిస్తున్నాడు. 'ఇనాయ్‌నోకి పాయమ్‌తోటి' అనే టైటిల్‌తో ధనుష్-మేఘా ఆకాష్ జంటగా మరో చిత్రం తెరకెక్కించనున్నాడు.
మరో వైపు 'ఒండ్రుగా' అనే టైటిల్‌తో దక్షిణాది అన్ని భాషల్లో, నాలుగు భాషలకి సంబంధించిన హీరోలైన తమిళ హీరో జయం రవి, మలయాళ హీరో పృథ్వీరాజ్, కన్నడ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్, తెలుగు స్టార్ సాయిధరమ్‌తేజ్‌లతో మరో మల్టీస్టారర్ ప్రారంభించనున్నాడు. ఇంత బిజీలో ఉన్న ఆయన చెన్నై నుంచి 'ధృవనక్షత్రం' షూటింగ్ నిమిత్తం మహాబలిపురం వెళ్తుండగా, చెన్నై ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఆయన కారుని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.
కానీ గౌతమ్‌మీనన్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా అదృష్టం కొద్ది చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నారు. వెంటనే వీరిని ప్రాధమిక చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. ఇక ఆ సమయంలో గౌతమ్‌మీనన్ గానీ, ఆయన డ్రైవర్ గానీ మద్యం తాగిలేరని, ఇక కారు కూడా పెద్ద వేగంగా వెళ్లడం లేదని తెలిపిన పోలీసులు లారీ డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇక ఆ లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వచ్చే వేసవికి ఎలాగైనా 'దృవనక్షత్రం' విడుదల చేయాలనే పట్టుదలలో గౌతమ్ మీనన్ ఉన్నాడు.