పవన్ అక్టోబర్ నుంచే ప్రత్యక్షరాజకీయాలలోకి వస్తానని మీడియా సమావేశంలోనే చెప్పాడు. అక్టోబర్ గడిచిపోయి రెండు నెలల తర్వాత ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ప్రస్తుతం కృష్ణానది బోట్ దుర్ఘటనలో మరణించినవారి తరపున, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రైవేటీకరించడంపై తనగళం వినిపించాడు. కానీ మరలా ఆయన మరో రెండు మూడు రోజుల్లో 'అజ్ఞాతవాసి' డబ్బింగ్, ప్రమోషన్స్‌తో జనవరి చివరి దాకా మరలా బిజీ అవుతాడు. మరోవైపు ఆయనతో సినిమా ఉంటుందని మైత్రిమూవీమేకర్స్, ఎ.యం.రత్నం అంటున్నారు. మరి అవి కేవలం వారి ఊహేనా? లేక నిజమా? అనేది పవన్ నోటి వెంట నుంచి వస్తే తప్ప క్లారిటీ రాదు. ఇక పోరాడితే పోయేదేముంది, బానిససంకెళ్లు తప్ప.. అన్న మహాకవి కవితకు తగ్గట్లుగా తనకు అధికారం అవసరం లేదని, ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పాడు. గత ఎన్నికల్లో ఆయన టిడిపి, బిజెపిలను సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన వరుసగా కేంద్రంలోని బిజెపిపై తీవ్రమైన విమర్శలే చేశాడు.
ఇక టిడిపి విషయంలో కాస్త చూసిచూడనట్లుగా పోతున్నాడనే విమర్శ ఉంది. పలు విషయాలలో ఆయన చంద్రబాబుని కలిసి పలు సమస్యల గురించి ప్రస్తావించాడు. అదే సమయంలో ఆయన ఇప్పటివరకు మోదీని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనేది ఒక ప్రశ్న. ఇక ఆయనకు మోడీని అపాయింట్‌మెంట్ అడుక్కోవాల్సిన అవసరం లేదనే భావనకూడా ఉండి ఉండవచ్చు. అయినా ఇప్పటి వరకు పవన్ ఏపీ రెవిన్యూలోటు, రాజధాని, పోలవరం, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీలపై కనీసం ఘాటుగా మోడీకి లెటర్ కూడా రాయలేదు.
తాజాగా ఆయన వైజాగ్‌లో డ్రెడ్జింగ్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి, మొట్టమొదటి సారిగా తాను మోదీకి లెటర్ రాస్తున్నానని చెప్పాడు. మరి మిగిలిన విషయాలలో ఆయన ఇప్పటికే ఎందుకు ప్రధానికి ఉత్తరాలు రాయలేదు? ఇంకా ఆయన పూర్తి స్థాయి రాజకీయాలలోకి రాకపోవడంతో ఆ పని చేయలేదా? అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పటినుంచైనా సినిమాలను పక్కనపెట్టి పూర్తిగా ప్రజల్లోకి వస్తాడా? లేదా? అనేది కూడా సందేహంగానే ఉంది. మరోవైపు ఇంతకాలానికి ఆయన తాను బిజెపి, టిడిపి, వైసిపీ... ఇలా ఏ పార్టీ పక్షము కాదని, తాను ప్రజల పక్షమని చెప్పడం హర్షణీయం. అయితే ఆయన ప్రత్యేకహోదా విషయంలో కూడా మొదట ఎంతో దూకుడు చూపించి, ఆ తర్వాత మరలా తన పనిలో తాను పడిపోయాడు.. ఇప్పటికైనా కనీసం వచ్చే ఎన్నికల వరకు పూర్తిగా ప్రజల్లో ఉంటాడో లేదో వేచిచూడాల్సివుంది..!