పవన్ తాజాగా 'ఛలోరే..ఛలోరే...చల్' పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తల సమావేశంలో ఆయన ప్రసంగం వింటే ఎంతో మెచ్యూర్డ్‌గా ఉంది. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ ఉపన్యాసంలో జగన్‌తో పాటు మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు పప్పు లోకేష్‌పై కూడా తీవ్రవిమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్యవిషయాలను ప్రస్తావించడం ఆసక్తిని కలిగిస్తోంది. నేను బయట ఉండి సమస్యలపై పోరాడుతున్నాను. కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ సమస్యలపై పోరాడటం లేదు. సీఎం అయిన తర్వాతే ప్రజా సమస్యలు పరిష్కరిస్తానంటే కుదరదు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే అన్నం పెడతానంటే ఎలా? అంటూ విరుచుకుపడ్డాడు. నిజంగా పవన్ చెప్పింది వాస్తవం. జగన్ ప్రతిపక్షనేతగా తన విధులను, కర్తవ్యాలను, అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ధీటుగా ఎండగట్టే బదులు పదవి కోసం పాదయాత్రలు అంటూ ఉన్నాడు. ఇక మీ అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు... మీ సమస్యలన్నీ నేను అప్పుడు తీరుస్తున్నానంటూ మాట్లాడుతున్నాడే గానీ ఆయన నేడు రాష్ట్రంలోని సమస్యలు, కేంద్రం వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయం, వీటిని చంద్రబాబుగానీ జగన్‌గానీ ఇద్దరు పట్టించుకోకుండా మోదీ పట్ల మెతకగా ఉంటున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక పవన్ టిడిపికి అనుకూలం అనే ముద్రను కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, జగన్‌కి వాళ్ల తండ్రి ఇచ్చినట్లు నా తండ్రి నాకేమీ కోట్లు ఇవ్వలేదు. అలాగే లోకేష్‌కి వాళ్ల నాన్న పాల ఫ్యాక్టరీని ఇచ్చినట్లు నా తండ్రి నాకేమీ ఇవ్వలేదు... అంటూ ఇద్దరి వైఖరిని కడిగిపారేశాడు. మరోపక్క ప్రతి ముఖ్యమంత్రి కూడా ఓట్లను డబ్బులు పెట్టి కొనలేకపోతున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 10కోట్లు కూడా ఖర్చుకు చాలడం లేదని ఈమధ్య తరచుగా మాట్లాడుతున్నారు. అసలు డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయని, డబ్బు తీసుకున్న వారందరూ అవే పార్టీలకు ఓట్లు వేస్తారనే నమ్మకం ఏమైనా ఉందా? అసలు ప్రజలను డబ్బుకి మద్యానికి బానిసలను చేస్తున్నదే ఈ రాజకీయనాయకులు. వారే జనాలను చెడగొట్టి మరలా వారే ఇన్ని కోట్లు ఖర్చవుతున్నాయని ఏదో బ్రహ్మాండాన్ని కనిపెట్టినట్లు తామే నిజాయితీగా మాట్లాడుతున్నామని భావించి.. ఇలా ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెడితే మరలా వాటిని సంపాదించుకోవడం, వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే డబ్బులు సమకూర్చుకోవడం వంటివి చూస్తే దొంగలే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది.
ఇదే విషయమై పవన్ మాట్లాడుతూ, అసలు ప్రజలు ఓట్లు వేయడానికి డబ్బులు పెట్టి కొనలేకపోతున్నాం అంటున్నారు... అసలు ఓట్లని కొనాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా డబ్బులు ఇస్తామని ఎందరో వచ్చారు. కానీ నేను డబ్బుకు అమ్ముడు పోతే ప్రజలకు తన మీద నమ్మకం... విశ్వాసం ఎందుకుంటాయని ప్రశ్నించాడు. దీంతో ఇప్పుడు సరైన దారిలోకి పవన్ వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.