డ్రెడ్టింజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరించింది. దాంతో ఆ సిబ్బందిలో ఒక వ్యక్తి కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వైజాగ్ పర్యటనకు వచ్చిన జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. నష్టాలలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఫర్వాలేదు గానీ లాభాలలో ఉన్న ఈ సంస్థను ప్రైవేట్‌పరం చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, స్థానిక ఎంపీ బిజెపి ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్‌లు దీని నుంచి తప్పించుకోవచ్చేమో గానీ బిజెపి, టిడిపి పార్టీలు మాత్రం దీనిని తప్పించుకోలేవు. టిడిపి, బిజెపి నేతలకు ఎంత బాధ్యత ఉందో నాకు తెలియదు గానీ నేను నా బాధ్యతని మర్చిపోలేదు. నేను టిడీపీ పక్షమో, బిజెపి పక్షమో కాదని నేను ప్రజాపక్షమని స్పష్టం చేశాడు.
గతంలో 'గబ్బర్‌సింగ్' సెన్సార్ విషయంలో ఇబ్బంది వచ్చింది. అయినా నేను ఎవ్వరినీ కలవలేదు. ఎవరి సాయం తీసుకోలేదు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తే, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతారని, తమ అధికారం ఉపయోగిస్తారని అంటారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను... విమర్శిస్తున్నాను... ఏం పీకుతారో పీక్కోమనండి. నాకు భయం లేదు.... ధైర్యం ఉంది. ఒకే ప్రాణం.. పోతే మీ కోసమే పోగొట్టుకుంటాను గానీ ఎవరి కోసమోకాదు. నేను ఒక పిడికెడు మట్టినే కావచ్చు. కానీ దాని పవర్ ఎంటో చూపిస్తాను. మొదటిసారిగా ఈ విషయంలో నేను ప్రధానికి లేఖ రాయబోతున్నాను అని చెప్పాడు.
మరోవైపు పవన్ గత ఎన్నికల్లో బిజెపి, టిడిపిలకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందనే విషయం కూడా తెలిపాడు. నాడు వైసీపీ అంటే నేను భయపడ్డాను. దోచుకున్న వ్యక్తి నాయకుడైతే సమాజం మొత్తం మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకే నాడు వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. వేల కోట్ల సంపాదన ఎందుకు? తండ్రి చనిపోతే కుమారుడికి పదవా? ఇది రాచరికమా? ప్రజాస్వామ్యమా? పీఆర్పీ ఓటమి బాధించింది. పార్టీని దెబ్బతీసిన ప్రతి వాడినీ గుర్తుపెట్టుకున్నాను. అధికారం కాదు.. సరికొత్త రాజకీయం సృష్టంచలేకపోయామనేదే నా బాధ. జనాలను పట్టించుకోని నేతలను 2019 ఎన్నికల వరకు గుర్తుంచుకుంటాను. డీసిఐపై స్పందించకుంటే వైజాగ్ నుంచే బిజెపి ఓటమి ప్రారంభం అని చెప్పాడు. ఇంతవరకు అన్నింటికీ పవన్ సమాధానం చెప్పాడు గానీ సినిమా ఫీల్డ్‌లో తాను కూడా ఓ వారసుడినేనన్న విషయంపై కూడా ఆయన తన మనసులోని మాట చెప్పి ఉంటే బాగుండేది...!