ప్రస్తుతం విచ్చలవిడి ధోరణులు, చెడు అలవాట్లు ఏ ఒక్క రంగానికో పరిమితం కావు. అన్ని రంగాలలో అవి ఉన్నాయి. అలాంటి వారెందరో ఉన్నారు. అన్నిరంగాలలోనూ అన్ని అలవాట్లు ఉండే వారు ఉన్నారు. అయితే మామూలు వ్యక్తులు ఆ పని చేస్తే వారి ఆరోగ్యం, డబ్బులే దెబ్బతింటాయి. కానీ సెలబ్రిటీలు, పేరున్నవారు, కోట్లాది మందికి ఆదర్శంగా ఉండేవారు.. అలాంటి పనులు చేస్తే మాత్రం వారిని స్ఫూర్తిగా తీసుకునే వారిలో కూడా ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. సిగరెట్లు, మద్యం, డ్రగ్స్ వంటివి ఎందరినో ప్రభావితం చేసే సెలబ్రిటీలలో ఉంటే మాత్రం అది మరింత ప్రమాదకరం. ముఖ్యంగా సినిమా వారిని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు.
వారి మీద వచ్చే వార్తలను చదివి, వారి గురించి వచ్చే విశేషాల కోసం ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తమ హీరోల బాటలోనే తాము కూడా పయనించాలని భావిస్తారు. ఈ విషయంలో ఎక్కువగా సినీ తారలు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులను చెప్పుకోవచ్చు. వారికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫలానా హీరో ఫలానా విధంగా చేశాడంటే దానినే ఫాలో అయ్యేవారు ఉంటారు. కాబట్టి మిగిలిన వారి అలవాట్లు వారిని, వారి కుటుంబాలను, బందువులను, పిల్లలను మాత్రమే ప్రభావితం చేస్తాయి. కానీ సెలబ్రిటీల విషయంలో అలా కాదు. అవి సమాజంపై దుష్ప్రభావం చూపుతాయి.
ఇక తాజాగా డ్రగ్స్, మద్యం గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, పిల్లలను క్రమశిక్షణతో పెంచితే వారు దురలవాట్ల బారిన పడరు. ఇల్లు ప్రశాంతంగా, క్రమశిక్షణగా, ఆనందంగా ఉంటే పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకోరు. కానీ ఉదయం లేచింది మొదలు ఇంట్లోని తల్లిదండ్రులు, పిన్నిబాబాయ్‌లు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే వారికి ఆనందం మిగలక దురలవాట్ల వైపు మొగ్గు చూపుతారు. పిల్లల్లో మంచి లక్షణాలు పెరగాలంటే ఇంట్లో ఆహ్లాదరకమైన వాతావరణం ఉండాలి.. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే అన్ని అలవాట్లు దూరంగా ఉంటాయి అని పోసాని చెప్పుకొచ్చాడు. ఇది అక్షరసత్యం. ఇక ఓ పాత్రికేయుడు సినిమా ఫీల్డ్‌లో మద్యం, డ్రగ్స్ గురించి ప్రశ్నించగా, పోసాని మద్యం తీసుకునే వారు ఇండస్ట్రీలోనే ఉన్నారా? మీ మీడియాలో మద్యం తాగేవారు లేరా? మద్యం, డ్రగ్స్ అనేది కేవలం సినిమా, మీడియాలకే పరిమితం కాదని, అన్ని రంగాలలో ఉన్నాయని చెప్పాడు. ఇది నిజమే అయినా నిజానికి సినిమావారు మీడియా మెప్పుకోసం డబ్బులతో పాటు మందు పార్టీలు ఇవ్వడం సరైన పద్దతా? అది ఇండస్ట్రీ వారు చేస్తున్న తప్పుకాదా?
అసలు నేడు నిజమైన జర్నలిస్ట్‌లను, నిజాలు రాసే వారిని ఇండస్ట్రీలోని వారు దగ్గరకు తీస్తున్నారా? ఎవరు ఎక్కువ భజన చేస్తారు? తమను ఎవరు ఎక్కువ పదాలు, అతిశయోక్తులతో పొగుడుతారో వారినే దగ్గరకు తీస్తున్నారు. సినిమా బాగా లేకపోతే బాగాలేదని రాసే వారిపై భౌతికదాడులు చేస్తున్నారు. కలం పదును, ఆలోచన, రాసే విషయం మీద పరిజ్ఞానం, ఇండస్ట్రీలోని విషయాలు, సినిమాలపై పట్టు ఉన్న వారిని దూరంగా ఉంచుతున్నారు. తమని పొగిడే వారిని చేరదీస్తూ... వారిని మద్యం, డబ్బుల ద్వారా ఆకర్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు మానుకోవాలి. అందుకే వాస్తవ వాది లోక విరోధి అన్నారు...!