నాగార్జున ఫ్యామిలీకి రెండు హిట్స్ అందించిన కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడంటున్నారు. నాగార్జున కి సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ అప్పట్లోనే నాగార్జునకు మరో రెండు సినిమాలు చేసి పెడతానని కమిట్ అవ్వడమే కాదు... అన్నపూర్ణ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలకు అగ్రిమెంట్ కూడా రాశాడు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాని చేసి మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి హిట్ అందించాడు. అయితే నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా చేసిన టైం లోనే కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు సినిమాని చేద్దామని మాట ఇచ్చాడు.
అందుకు తగ్గట్టుగానే రారండోయ్ హిట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ.. బంగార్రాజు కథతో నాగ్ దగ్గరికి వెళ్లి స్టోరీ లైన్ చెప్పగా ఆ స్టోరీ నాగ్ కి అంతగా నచ్చలేదని మరికొన్ని కథలు సిద్ధం చేయమని చెప్పడం.... అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా నాగ్ చెప్పినట్టుగా చేసినా ఆ కథలేమి నాగార్జునకి నచ్చక కళ్యాణ్ కృష్ణ ని హోల్డ్ లో పెట్టడం... ఇంతలోపులో నాగార్జున.. వర్మ సినిమాకి, నాగ చైతన్య చందు మొండేటి, మారుతి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో చేసేది లేక కళ్యాణ్ కృష్ణ వేరే హీరోలకి కథలు వినిపించగా.... అందులో హీరో రవితేజ, కళ్యాణ్ చెప్పిన స్టోరీ లైన్ ని ఓకే చేసి సినిమా చేద్దామని... చెప్పడంతో కళ్యాణ్ కృష్ణ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు.
అయితే కళ్యాణ్ కృష్ణ - రవితేజ సినిమా మంగళవారం ప్రారంభమవ్వాల్సి ఉండగా... అన్నపూర్ణ సంస్థతో మూడు సినిమాకు కమిట్ అయ్యి... అందులో ఇంకా ఒక సినిమా బ్యాలెన్స్ ఉండగా.. ఇలా వేరే హీరోకి సినిమా చెయ్యడం ఏమిటని నాగార్జున.. కళ్యాణ్ కృష్ణతో రవితేజ సినిమా మొదలు కాకుండా అడ్డుకున్నాడనే టాక్ వినబడుతుంది. మరి అది నిజమేనా? నాగార్జున ఇలా ఒక దర్శకుడి ఫ్యూచర్ ని తొక్కేస్తున్నాడా? అసలు నాగార్జున అంతలా చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మాత్రం నాగ్, కళ్యాణ్ కృష్ణ పై కక్ష సాధిస్తున్నాడనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. .