ఆ మధ్య బండ్లగణేష్ మాట్లాడుతూ, పవన్ ఓ మథర్‌థెరిస్సా, గౌతమ్‌బుద్దుడు అంటూ పేర్కొన్నాడు. నిజానికి చిరంజీవి, పవన్‌లు కూడా వారి బాటలో నడుస్తున్నామని చెబుతారే గానీ తమకు తాముగా మథర్‌థెరిస్సా, గౌతమబుద్దుడితో పోల్చుకోరు. ఇక పవన్‌కి లండన్‌లో అవార్డులు ఇస్తుంటే ఇక్కడున్న మనం ఆయన గొప్పతనాన్ని అర్ధం చేసుకోవడం లేదంటూ బండ్లగణేష్ సెలవిచ్చాడు. ఇక చిరు సినిమాలలో, రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా వీరు ఇదే మాట మాట్లాడారు. మరి ఇప్పుడు చిరంజీవిని పొగడటం మానేసి పవన్ భజన మొదలుపెట్టారు. ఇక బండ్ల పవన్‌ని దేశానికి ఐకాన్ రాజకీయనాయకుడు అంటూ గౌతమబుద్దుడు, మథర్‌ధెరిస్సాలతో పోలిస్తే తాజాగా కమెడియన్ 30ఇయర్స్ పృథ్వీ ఆయన్ను ఏకంగా ఐన్‌స్టీన్, న్యూటన్‌లతో పోల్చాడు. బల్బుని ఎవరు కనిపెట్టారు? విమానాన్ని ఎవరు కనిపెట్టారో కూడా తెలియక ఒకరి పేరును మరోవారితో పిలిచి పవన్ ఆ మధ్య తన పేరు చెడగొట్టుకున్నాడు.
ఇక ఏపీలో అయితే బికాంలో ఫిజిక్స్‌లు, బైపిసిలో మాథ్స్‌లు ఉన్నాయని చెప్పే మంత్రులు, ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఇక థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. తాను పవన్‌ని పొగడటం, భజన చేయడం లేదని, నిజమైన వాస్తవాలను చెబుతున్నానని చెప్పి ముందరి కాళ్లకు బంధం వేసి ముందుగా విమర్శకుల నోటికి తాళం వేసి తన 'లౌక్యం', నటునిగా తన అనుభవం చూపాడు ఈ బాయిలింగ్ స్టార్ బబ్లూ. పవన్ మామూలు పవర్‌స్టార్ కాదని, ఆయన నడిచి వచ్చే ఓ అగ్నిగోళమని పొగిడాడు. సారీ... వాస్తవం చెప్పాడు. ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని కొత్త విషయాన్ని పృధ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి బాగా కనిపెట్టాడు. పనిలో పనిగా పవన్ తనని స్ఫురద్రూపి అంటాడని చెప్పుకొచ్చాడు. బహుశా ఈ పదాన్ని ఎన్టీఆర్ తర్వాత అలా పిలిపించుకున్న ఏకైక వ్యక్తి కేవలం ఈ బాయిలింగ్ స్టార్ మాత్రమే.
తాజాగా తాను పవన్‌ని కలిసినప్పుడు ఓ మట్టికూజా, మట్టి గ్యాస్ ఉన్నాయని దీనిని బట్టి ఆయన ఎంతటి డౌన్‌టు ఎర్త్ పర్సనో తెలుస్తోందని చెప్పాడు. ఆయనను మన ముందుంచుకుని ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం. న్యూటన్‌వంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలను గురించి చదువుతున్నాం. కానీ మన ముందున్న గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని చెప్పాడు. అంటే రేపటి నుంచే అందరు కూడా నులక మంచం వేసుకుని, పక్కన మట్టి కూజ, ఆ పక్కన మట్టి గ్లాస్, వెనుకన అంబేడ్కర్, చెగువేరా, మదర్‌థెరాస్సా, గాంధీ వంటి వారి ఫ్లెక్సీలు తగిలించుకుంటే అందరూ కూడా మేధావులం అయిపోవచ్చనే నగ్న సత్యాన్ని పృథ్వీ అందరికి తెలియజెప్పాడు. ఎలాగూ పవన్‌కి చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. లండన్‌లో అవార్డు కూడా బాబు పుణ్యమేనని అంటున్నారు కాబట్టి తనకి నంది అవార్డు రానంత మాత్రాన చంద్రబాబు మీద అలగకుండా పృథ్వీ వెళ్లి బాబుకి ఇక నుంచి ఏపీలోని విద్యార్దులందరికీ తమ పాఠ్యాంశాలలో పవన్ జీవిత చరిత్రను పెట్టమంటే ఓ పనైపోతుంది కదా..!