2018 జనవరిలో ఈ సంక్రాంతికి తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతి బారి నుండి మహేష్ బాబు భరత్ అనే నేను, రామ్ చరణ్ రంగస్థలం ముందే తప్పుకున్నప్పటికీ.. మరిన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలకు డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. కొన్ని బడా ప్రాజెక్టులు వరుసపెట్టి తేదీలు ఎనౌన్స్ చేశాయి. అయితే అందులో కొన్ని సినిమాలకే క్లారిటీ ఉంది. అయితే ఈ గందరగోళాన్ని తప్పించేందుకు నిన్న సోమవారం నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. అసలు సంక్రాంతికి కాస్త ముందుగానే ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయి అని క్లారిటీ తెచ్చుకుంటే బెటరని నిర్మాతల మండలి ఈ చర్చలు ప్రారంభించింది.
అక్కడ కౌన్సిల్ సమావేశంలో జరిగిన చర్చ బట్టి చూస్తుంటే.. ఎక్కువగా తమిళనాట సూర్య నటించిన గ్యాంగ్ సినిమాపైనే ఎక్కువగా డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. సూర్య, రమ్యకృష్ణలు నటిస్తున్న గ్యాంగ్ సినిమాను సంక్రాంతికి బరిలో నిలుపుతున్నట్టుగా తాజాగా ప్రకటించారు. కాకపోతే తెలుగులో యూవీ క్రియేషన్స్ సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. మరి ఈ సంక్రాంతికి బాలయ్య జై సింహా, పవన్ అజ్ఞాతవాసి సినిమాలు బరిలో ఉన్న వేళ.. గ్యాంగ్ ను కూడా థియేటర్లలోకి తీసుకొస్తే తెలుగు నిర్మాతలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టవుతుంది. అందుకే ఆ సినిమా విడుదలను వాయిదా వేసుకోమని నిర్మాతల మండలి సభ్యులు యూవీ నిర్మాతల్ని కోరినట్టుగా తెలుస్తోంది.
అంతేకాకుండా మరో కోలీవుడ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలకాబోతున్న విశాల్ అభిమన్యుడు ఈసినిమాపై కూడా చర్చ జరిగినప్పటికీ దానిపై నిర్మాతల మండలి పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. ఎందుకంటే అభిమన్యుడు సినిమాకు పెద్దగా థియేటర్లు దొరక్కపోయినా ఫర్వాలేదని ఆ సినిమా నిర్మాత నిర్మాతల మండలికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు సంక్రాంతి బరిలో దిగిన రీసెంట్ మూవీ సూర్య గ్యాంగ్ పైనే ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరో మీడియం బడ్జెట్ మూవీ రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు సినిమాను కూడా సంక్రాంతి బరి నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఈ సంక్రాంతికి బాలయ్య, పవన్ లతో పోటీపడే వారెవరో అనేది.