పక్కనోడి ఇళ్లు కాలుతుంటే ఆనందపడుతూ, మంటల్లో చలికాచుకుని, బీడీలను ఆ మంటతో వెలిగించుకునే మనస్తత్వం ఉన్న వారు నీతులు చెబితే ఆశ్యర్యం అనిపిస్తుంది. పైరసీ అనేది నేడు ఉన్న సమస్యకాదు. అది కేవలం తెలుగుకే పరిమితం కాదు. హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఆన్‌లైన్‌లోనే విడుదలైన రోజునే అధికారికంగా ఫలానా సమయం అని చెప్పి పైరసీలను వెబ్‌సైట్స్ ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. దీనిపై తమిళంలో విశాల్ వంటి వారు కలిసికట్టుగా దానిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంపేస్తామనే బెదిరింపులను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నారు. విశాల్ కేవలం తన చిత్రాల విడుదల సమయంలోనే పైరసీ గురించి మాట్లాడటం లేదు. ప్రతి చిత్రాన్ని తన భుజంపై వేసుకుని పైరసీపై పోరాడుతున్నాడు.
కానీ మన టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులకు మాత్రం తమ చిత్రాలు రిలీజైనప్పుడు మాత్రమే పైరసీ బాధ తెలుస్తుంది. మిగిలిన రోజుల్లో దాని గురించి అసలు మాట్లాడరు. 'డిజె' సందర్భంగా దిల్‌రాజు, హరీష్‌శంకర్, బన్నీలు పైరసీపై మాట్లాడారు. కానీ ఆ తర్వాత వారు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి రచయిత, బి.వి.ఎస్.రవికి పైరసీ గుర్తుకొచ్చింది. ఆయన తాను ఎంతో కష్టపడి రెండేళ్లు శ్రమించి కథను తయారు చేశానని, యూనిట్ అంతా చెమటలు చిందించిందని, నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టారని, కానీ 'జవాన్' చిత్రం మ్యాట్నీ షో కల్లా పైరసీ బయటికి వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది. అసలు తమ సినిమాలు రిలీజైనప్పుడే కాకుండా ఎవరి సినిమా అయినా, చిన్న సినిమా అయినా సరే అందరు కలిసి కట్టుగా ఉంటే గానీ పైరసీని ఆపలేరు. అసలు పైరసీలు బయటికి రావడానికి బయటివారికంటే ఇంటి దొంగలే ఎక్కువగా సహకరిస్తున్నారు.
ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్లు, కర్ణాటక, చెన్నై ప్రాంతాలలోని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌తో పాటు ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ బయటికి వచ్చేస్తోంది. ముందుగా ఇంటి దొంగలను పట్టుకోవాలి. ఇక ఒక హీరో మీద కోపంతో వారి యాంటీ ఫ్యాన్స్, వారు ప్రోత్సహించారు కదా.. అని వారికి వీరు వీరికి వారు పోటీపడి పైరసీని ఎంకరేజ్ చేస్తుండటం గమనార్హం. ఇక 'అజ్ఞాతవాసి'కి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, అటు దిల్‌రాజు అండతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా అనుమతి తెచ్చుకుని యూనిఫాం రేట్లగా 200రూపాయలకు పైగానే ఒకే ధరకుటిక్కెట్ రేట్లుగా నిర్ణయించనున్నారని తెలుస్తోంది. 'బాహుబలి' నుంచి పెద్ద సినిమాలన్నింటికి ఇలా జనాల వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకొని దోచుకుంటున్నారు. మరి దానిపై మాట్లాడితే మాత్రం మన మేకర్స్‌కి కోపం వస్తుంది. ముందుగా కేవలం ఎప్పుడు అమ్మే రేటుని, ఇంటి దొంగల మీద దృష్టి సారిస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందే గానీ.. ఇలా ఏదో పౌర్ణమికి, అమావాస్యకి తూతూమంత్రంగా తమ చిత్రాలు రిలీజైనప్పుడు మాత్రమే మాట్లాడితే పైరసీ ఎప్పటికీ అంతం కాదు.