ఇండస్ట్రీలో జరిగే రాజకీయాలు, శత్రుత్వాలు, ఒకరితో ఒకరికి ఉండే గొడవలు ఆయా వ్యక్తుల మరణంతో మరుగున పడిపోతూ ఉంటాయి. ఇక సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రాజశేఖర్‌ల విషయంలో ఎదురైన ఇబ్బందులు తన బయోగ్రఫీలో రాశాడు. కానీ దానిని బ్యాన్ చేసేలా మన పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఇక నాడు అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న కాట్రగడ్డ మురారి తనకెదురైన వాటిని 'నవ్విపోదురు గాకా' నాకేంటి అన్నట్లుగా తన పుస్తకం పేరుతో ఆ టైటిల్‌ని పెట్టి పలు చిత్రాల హీరోలు, దర్శకులతో తాను ఎదుర్కొన్న అనుభవాలకు అక్షరరూపం ఇచ్చాడు. ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు అసలు మనం ప్రేమించే, దైవంగా భావించే వారి వ్యవహారాలు బట్టబయలు అవుతాయి. ఎంత సేపు అందరినీ పొగుడుతూ, భజనలు చేస్తూ వాటినే తమ జీవిత గాధలుగా చెప్పుకోవడం, వారిని వారి దేవుళ్లుగా పోల్చుకునే పుస్తకాల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగం లేదు.
కాగా ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాపించింది కాబట్టి పలువురు తమకు జరిగిన అవమానాలు, కాస్టింగ్‌కౌచ్‌ల నుంచి అన్నింటిని బయటపెడుతున్నారు. ఇక అలనాడు అంజలీదేవి, భానుమతి, సావిత్రిల కోవకి చెందిన స్టార్ హీరోయిన్ జమున. ఈమె ఎంతో నిక్కచ్చి మనిషి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకునేది కాదు. ఎవ్వరికి భయపడలేదు. సావిత్రి అయినా కొన్ని విషయాలలో రాజీ పడిండే గానీ జమున తన కెరీర్‌లో ఎప్పుడు.. ఎవ్వరితో కాంప్రమైజ్ కాలేదని నాటి సినీ పెద్దలు చెబుతారు. ఇక నాడు టాప్‌స్టార్స్‌గా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు ఆమెను ఒకానొక దశలో తమ చిత్రాల నుంచి బహిష్కరించారు. దీనికి లోతైన కారణాలున్నాయి. వారు తమ చిత్రాలలో చాన్స్‌లు ఇవ్వకపోవడంతో జమున నాడు సెకండ్‌గ్రేడ్ హీరోలైన హరనాథ్, జగ్గయ్య, అప్పుడే స్ధిరపడుతున్న కృష్ణవంటి వారితో కలిసి చేసిందే గానీ ఆ ఇద్దరు స్టార్స్‌కి మాత్రం లొంగలేదు. ఆమెను మేము పెట్టుకోమని ఆ హీరోలు బెదిరిస్తే మీరు కాకపోతే దారిన పోయే దానయ్యతో అయినా నటించిన జమున హిట్ అవుతానని చాలెంజ్ చేసి దానిని చేతల్లో నిరూపించింది. చిన్నహీరోలతో ఆమె నటించిన చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి.
ఇక నాటి ఈ విషయాలను ఆమె తాజాగా బయటపెడుతూ చివరకు నాగిరెడ్డి-చక్రపాణిలు 'గుండమ్మకథ'లో సావిత్రితో పాటు నన్ను పెట్టుకోవాలని భావించి రాజీ ప్రయత్నం చేశారు. ఎదురుగా ఆ స్టార్ హీరోలిద్దరు, నాగిరెడ్డి, చక్రపాణి కూర్చున్నారు. ఎదురుగా నేను, మా నాన్న కూర్చున్నాం. వారు ఇక అలా ప్రవర్తించనని చెప్పి సారీ చెప్పమని, క్షమాపణ పత్రం రాయాలని కోరారు. దానికి నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతాను. కానీ నేను ఇప్పుడు ఎందుకు సారీ చెప్పాలి? నేను చేసిన తప్పేంటి? నేను ఇక అలా ప్రవర్తించను అని రాయమంటున్నారు. ఇంతకీ నేను ఎలా ప్రవర్తించాను? భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు సూటిగా నాకు చెబితే గానీ నేను సారీ చెప్పి, క్షమాపణ పత్రం రాయనని చెప్పాను. చివరకు ఎలాగో రాజీ జరిగింది. ఈ టాప్‌హీరోలతో మూడేళ్లు నేను నటించలేదు అని చెప్పుకొచ్చింది.