వర్మ తిట్టినా, పొగిడినా, మౌనంగా ఉన్నా కూడా వివాదాలు, చర్చలే జరుగుతుంటాయి. మొదట్లో చిరంజీవి, పవన్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలను ఆకాశానికి ఎత్తేసిన వర్మ ఆ తర్వాత వారిపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇక డ్రగ్స్ వ్యవహారం, నంది అవార్డులు, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఇవాంకా ట్రంప్ ఇలా అందరిపై దండయాత్ర చేశాడు. కాగా ఇప్పుడు ఆయన నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే కాబోలు ఆయన నాగార్జున చిన్నకుమారుడైన అక్కినేని అఖిల్ రెండో చిత్రం, రీలాంచ్ ఫిల్మ్‌గా భావిస్తున్న 'హలో' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అఖిల్ మొహంలో ఉన్న తపన చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, ఆయన ఈజ్, తీవ్రత చూసి గర్వంగా ఉంది. యాక్షన్ సీన్స్ ఎంతో రీఫ్రెషింగ్‌గా ఉన్నాయి. 'మనం' చిత్రంలోని ఎమోషన్స్‌ని మిస్ చేయకుండా రొమాంటిక్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈచిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రం ఎప్పుడెపుప్పడు చూద్దామా? అని ఆసక్తిగా ఉంది. ఈ చిత్రం విడుదలయ్యే 22వ తేదీ వరకు ఆగలేకపోతున్నాను అంటూ కామెంట్స్ చేశాడు.
ఇక ఈ చిత్రం ట్రైలర్‌లో అఖిల్ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున వాయిస్‌ఓవర్ ఇచ్చాడు. అఖిల్‌కి తల్లిదండ్రులుగా రమ్యకృష్ణ, జగపతిబాబులు కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌లోనే 'ఫ్రం ది డైరెక్టర్ ఆఫ్ మనం' అని వేసి, ప్రేక్షకులు తమ హృదయాలను అవార్డులుగా ఇచ్చిన చిత్రం అనే అర్ధం వచ్చేలా కామెంట్ చేస్తూ 'మనం'కి నంది అవార్డుల విషయంలో జరిగిన అన్యాయానికి చురక వేస్తూన్నట్లుగా ఉండటంతో ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.