గతంలోలాగా ఈ మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కి, విజయం సాధించిన సినిమాలు కూడా పట్టుమని 50 రోజులు ఆడే పరిస్థితి లేదు. సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ రక్కసి నిర్మాతలకు గుదిబండలా తగులుకుంటుంది. హిట్ టాక్ ఎత్తుకున్న సినిమాలకు కూడా దాదాపు రెండు వారాలకే కలెక్షన్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి. ఇక టాక్ అటో ఇటో ఉంటే ఇక నిర్మాతల పని అవుట్. అందుకే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అంటే మొదటి రెండు మూడు రోజులు టికెట్ ధరలు పెంచేసి ఒక్క వారంలోనే కలెక్షన్స్ కొల్లగొట్టేసే ప్లాన్ చేస్తున్నారు బయ్యర్లు. అందులో భాగంగానే పెద్ద సినిమా విడుదలై మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర 150 ఉంటే దానికి మరో 50 అదనంగా వడ్డించి 200 లాగేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ టికెట్ ధరలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కూడా భాగమవబోతుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిర్మాతలు, బయ్యర్స్ కూడా అదే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అజ్ఞాతవాసి సినిమాకి దాదాపు 100 కోట్ల పైనే బడ్జెట్ ఎక్కింది. మరి అదే లెవల్లో 150 కోట్ల బిజినెస్ చేసిందనే టాక్ ఉండనే ఉంది. అజ్ఞాతవాసి కొనిన బయ్యర్స్ అయితే సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎలాగైనా మొదటి వారంలోనే కొన్న ధరను అందుకోవాలని యూనిఫామ్ టికెట్ ను పెట్టబోతున్నారనే టాక్ నడుస్తుంది. అంటే ఒక్క టికెట్ ధర 200 ఉండనుందట. మరి ఇప్పటికే మల్టిప్లెక్స్ లు పెద్ద సినిమాలకు అంత ధరను వసూలు చేస్తున్నాయి.
ఇప్పుడైతే అజ్ఞాతవాసికి మల్టిప్లెక్స్ లు మాత్రమే కాదు అన్ని థియేటర్స్ నుండి 200 వసూలు చేస్తారట. మరి అన్ని థియేటర్స్ లోను 200 టికెట్ అంటే.. కొందరు హర్షించలేని నిర్ణయమైనప్పటికీ ఇది జరిపించాలని ఆలోచనలోనే బయ్యర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రేటును అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ లు అమలు చేస్తాయో లేదో అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం అజ్ఞాతవాసి నిర్మాత, బయ్యర్ల ఆలోచనను ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూద్దాం.