ఈ శుక్రవారం కన్నా ముందే అంటే గురువారమే... ఒక డబ్బింగ్ సినిమా ఇంద్రసేన, ఒక స్ట్రయిట్ సినిమా ఆక్సిజన్ లు థియేటర్లలోకి వచ్చాయి. టాక్ పరంగాను... వీక్ గా ఉన్న ఈ సినిమాలు వసూళ్ల పరంగా కూడా ఈ రెండు సినిమాలూ వీక్ గానే ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. గోపీచంద్ - రాశి ఖన్నా - అను ఇమ్మాన్యువల్ నటించిన ఆక్సిజన్ సినిమాకు మొదటి రోజు దారుణాతిదారుణంగా కోటి 59 లక్షల రూపాయలు వసూళ్లు వచ్చాయంట. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలాసార్లు వాయిదాలుపడి ఎట్టకేలకు ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై అటు మేకర్స్ కూడా ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. నిజంగా వాళ్ల అంచనాలకు తగ్గట్టే ఫ్లాప్ టాక్ తో ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది ఆక్సిజన్.
ఇక ఈ గురువారం ఆక్సిజన్ తో పాటు విడుదలైన మరో తమిళ డబ్బింగ్ సినిమా ఇంద్రసేనది కూడా అదే పరిస్థితి. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు కేవలం అంటే కేవలం 23 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇదే హీరో గతంలో నటించిన యమన్ సినిమాకు మొదటి రోజు 60లక్షల రూపాయల షేర్ వస్తే, బేతాళుడు సినిమాకు ఏకంగా ఫస్ట్ డే కోటిన్నర వచ్చింది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈ హీరో ఇంద్రసేనతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. గత సినిమాలతో పోలిస్తే ఈసారి కాస్త ఘనంగానే ప్రచారం చేసినప్పటికీ.. సరైన కంటెంట్ లేక సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసి ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.
ఇకపోతే ఈ శుక్రవారం విడుదలైన జవాన్ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన జవాన్ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. కాకపోతే ఆక్సిజన్, ఇంద్రసేన సినిమాలతో నవంబర్ బాక్సాఫీస్ డల్ గా ముగిసింది. నవంబర్ లో విడుదలైన సినిమాల్లో గరుడవేగ మాత్రమే హిట్ అయింది. అదిరింది, ఖాకి, గృహం సినిమాలు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. ఇక డిసెంబర్ 1 న విడుదలైన జవాన్ మాత్రం మిశ్రమ స్పందనతో బోణి చేసింది.