నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల మద్య తీవ్రమైన పోటీ ఉన్నా కూడా వారు కలిసి నటించడానికి సంశయించే వారు కాదు. దాంతో ఏయన్నార్-కృష్ణ, ఎన్టీఆర్ -ఏయన్నార్, ఎన్టీఆర్-కృష్ణ, కృష్ణ-కృష్ణంరాజు, కృష్ణ-శోభన్‌బాబు వంటి వారితో ఎన్నో మల్టీస్టారర్ వచ్చేవి. ఇక నాడు ఎన్టీఆర్‌కి, కృష్ణ ఫ్యాన్స్‌కి అసలు పడేదే కాదు. ఏయన్నార్ క్లాస్ హీరో. కాబట్టి ఆయనకు శోభన్‌బాబు వంటి వారు పోటీ పడ్డారే గానీ ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరు మాస్ అండ్ యాక్షన్ హీరోలు కావడంతో వీరి మద్య పోటీ విపరీతంగా ఉండేది. పాత చిత్రాలలో వారు కలిసి నటించి, ఆ తర్వాత ఇద్దరికి స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా వారు 'దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు' వంటి చిత్రాలలో కూడా కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజుని కృష్ణ చేయడం వల్ల వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనే సంగతి అందరికీ తెలిసిందే.
దీని గురించి నాడు కృష్ణ సొంత బేనర్ నిర్మాణ పనులు, ఇతర కృష్ణ కాల్షీట్స్ వంటివి చూసిన ఆయన సోదరుడు జి.ఆదిశేషగిరిరావు తాజాగా మాట్లాడారు. ఎన్టీఆర్ 'జయసింహ' తర్వాత అల్లూరి సీతారామరాజు చేయాలని భావించారు. ఆయన చేస్తే మేము చేయకూడదని భావించాం. కానీ ఎన్టీఆర్ ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. దాంతో మేము ఈ చిత్రం చేశాం. ఈ చిత్రం షూటింగ్ మొదటి రోజే దర్శకుడు వి.రామచంద్రరావు అనారోగ్యం పాలు కావడంతో సినిమా దర్శకత్వ బాధ్యతలను కృష్ణనే తీసుకున్నారు. యాక్షన్ సీన్స్ తప్పా అంతా కృష్ణనే దర్శకత్వం వహించారు అని చెప్పారు.
'అల్లూరి సీతారామరాజు'లోని యాక్షన్ సీన్స్‌ని కృష్ణకి ఆత్మీయుడైన దర్శకుడు కె.యస్.ఆర్. దాసు తీశాడు. ఇక ఎన్టీఆర్, కృష్ణ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' గురించి ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, కృష్ణ నటించిన 'పండంటి కాపురం' శతదినోత్సవ వేడుకలను విజయవాడలో జరిపాం. ముఖ్యఅతిధిగా ఎన్టీఆర్‌ని ఆహ్వానించాం. ఆయన వేదిక మీద ఉండగానే కృష్ణ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో చేస్తే బాగుంటుందని భావించి, సభాముఖంగా ఎన్టీఆర్‌ని కోరారు. దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారు. అలా ఆ చిత్రానికి బీజం పడింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. దాంతో ఎన్టీఆర్ చేయరేమో అని భావించాం. కానీ ఆయనే ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందని అడగటంతో పక్కరోజు నుంచే పనులు మొదలెట్టాం.. అని చెప్పుకొచ్చాడు.