నడిగర్ సంఘం ఎన్నికల్లో, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన తర్వాత హీరో, నిర్మాత విశాల్‌రెడ్డి అలియాస్ విశాల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తమిళ సినిమా పైరసీలను పెట్టే తమిళ్ రాకర్స్‌పై పోలీసులకు ఫిర్యాదు. సినిమా టిక్కెట్ డబ్బులు రైతు నిధికి కొంత వంటివి ప్రవేశపెట్టాడు. ఇక పైరసీ నిరోధం కోసం స్పెషల్ స్క్వాడ్‌ని నియమించాడు. బిజిపి ఇబ్బంది పెడుతుందని తెలిసినా 'మెర్శల్'కి మద్దతు పలికాడు. ఇక దీంతో ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నా భయపడేది లేదంటున్నాడు. తాజాగా తమిళ నిర్మాత అశోక్‌కుమార్ ఫైనాన్షియర్ల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా తీవ్రంగా స్పందించాడు.
తమిళ సినిమా పరిశ్రమను ఇలాంటి ఫైనాన్షియర్ల నుంచి విముక్తి చేయాలని పిలుపునిచ్చాడు. ముఖ్యంగా నిర్మాత అశోక్‌కుమార్ మరణానికి కారణమైన అన్బుచెలియన్ అనే ఫైనాన్షియర్ నుంచి బెదిరింపులు, ఇబ్బందులు పడుతున్న వారందరూ తమకి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చాడు. దీంతో అన్బుచెలియన్ అనుచరులు విశాల్‌కి వాట్సప్ ద్వారా మత, కుల, ప్రాంతీయ విద్వేషాలను ప్రేరేపించే హింసాత్మకమైన మెసెజ్‌లతో బెదిరించాలని చూశారు. దీనిపై నిర్మాత మణిమారన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విశాల్ మాట్లాడుతూ, మత, కుల, ప్రాంతీయ విద్వేషాలను రెకెత్తించడం ద్వారా ఈ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అన్బుచెలియన్ వంటి వారి బెదిరింపులకు లొంగేది లేదని తెగేసి చెప్పాడు.
ఇక చెన్నైలోని నడిగర్ సంఘం భవనాన్ని, కాంప్లెక్స్‌ని ఎందరో నిర్మిస్తామని చెబుతూ వచ్చినా ఎవ్వరూ ఆ పని చేయలేదు. నేను అందుకే ఎన్నికల్లో పోటీ చేశాను. ఏదైనా సమస్య వస్తే నా గొంతు వినిపించడానికి ఏమాత్రం భయపడను. అనుకున్న పనిని సగంలో ఆపేయడం నాకు చేతకాదు. ఇక నడిగర్ సంఘం బిల్డింగ్‌ని చెన్నైలోనే ఐకాన్‌గా నిర్మిస్తాం. ఇందులో కళ్యాణమండపం, కన్వెన్షన్ సెంటర్‌తో పాటు అన్ని వసతులు ఉంటాయి అని చెప్పాడు. మరి ఆ కళ్యాణమండపంలో తొలి పెళ్లి మీదేనా అని ప్రశ్నిస్తే.. లేదు లేదు.. ఆర్య వివాహం చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కాబట్టి ఆర్య పెళ్లితో అది మొదలవుతుందని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.