హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంటే నరకం కనిపిస్తుంది. బిజీ సమయాలలో అయితే గంటలకు గంటలు ట్రాఫిక్‌జామ్‌తో నిరీక్షించకతప్పదు. ఎంత బిజీ పనులున్నా కూడా జనాలకు ఈ తలనొప్పి భరించక వీలుకాదు. ఇలాంటి పద్మవ్యూహంలో చిక్కుకున్న సామాన్యులే కాదు.. ఎంతో ఎమర్జెన్సీ అయిన అంబులెన్స్‌లు రోగుల ప్రాణాలు పోతున్నా, ఆసుపత్రి చేరేదాకా వారి ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. ఇక ఫైరింగ్ ఇంజన్లు అయితే అగ్నికి ఆహుతై, బుగ్గి పాలయిన తర్వాత చేరుకుంటాయి. మన ప్రముఖులు వస్తుంటే నిర్దాక్షిణ్యంగా పోలీసులు, ఆ ప్రముఖులు కూడా తామే ఆకాశం నుంచి ఊడిపడినట్లు అంబులెన్స్‌లకి కూడా రోడ్డు క్లియరెన్స్ ఇవ్వరు. తాము వస్తే ఎంత హడావుడి జరిగింది... ఎంతగా ట్రాఫిక్ జామ్‌లయ్యాయి అనేవే మన నాయకులకు ఉండే ఇమేజ్‌కి, క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పుకుంటారు.
ఇక అమెరికా అధ్యక్షుడి గారాల పట్టి వస్తే ఇంక ఎంత హంగామా ఉంటుందో మూడురోజుల పాటు ప్రజలకు ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను గూర్చి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక హైదరాబాద్‌కి కొత్తగా మెట్రో రావడంతో ఇకనైనా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని హైదరాబాద్ వాసులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇవాంకా ట్రంప్ రాక కారణంగా ఉదయం నుంచి ట్రాఫిక్‌లో హీరో నవదీప్ ఇరుక్కుపోయాడు. దాంతో ఆయనకి విసుగొచ్చింది. వెంటనే ఆయనకు పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' సినిమాలో అనిరుధ్ స్వరపరిచిన 'బయటికొచ్చి చూస్తే' పాటకు తన క్రియేటివిటీని చూపించి నవదీప్ తన బాధను వెలిబుచ్చాడు. ఆ కోపాన్ని పాటలో చూపిస్తూ..'బయటికెళ్లి చూస్తే 10ఓ క్లాక్...ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంకా రోడ్డు బ్లాక్'అని సోషల్‌మీడియాలో పెట్టాడు. ఆయన ఆవేదనకు సోషల్‌మీడియాలో మంచి స్పందనే వస్తోంది...!
మరోవైపు విజయ్‌ఆంటోని నటిస్తున్న 'ఇంద్రసేన' పబ్లిసిటీకి ఇవాంకా ట్రంప్‌ని ఆ యూనిట్ వాడేసుకుంది. 'వెల్‌కం టు హైదరాబాద్ ఇవాంకా ట్రంప్' అంటూ పోస్టర్‌కి ఒకవైపు ఇవాంకా ట్రంప్ ఫొటోని పెట్టి, రెండో వైపు టెర్రిఫిక్‌లుక్‌లో ఉన్న విజయ్‌ఆంటోని బొమ్మతో పోస్టర్లను ప్రింట్ చేయడం, సోషల్‌మీడియాలో పెట్టడమే కాదు.. నగరంలో భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. ఇలా జనాలు తమ ట్రాఫిక్ ఇబ్బందుల్లో తాముంటే మరోవైపు 'ఇంద్రసేన' యూనిట్ దానిని తమ చిత్రానికి క్రేజ్ కోసం వాడుకుంది..!