ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకోవడానికి సుందరాంగులు ఎంతెలా కష్టపడతారో అనేది ఎవ్వరికి తెలియంది కాదు. అలా ఒక్కసారి ప్రపంచ సుందరి కిరీటం నెత్తి మీదకి వచ్చింది అంటే ఇక ఆ సుందరాంగి చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. అంతేకాదు ఫ్యాషన్ ప్రపంచంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని మోస్తున్న అమ్మాయికి ఒకవైపు ఫ్యాషన్ ప్రపంచం పిలుస్తుంటుంది. ప్రపంచ సుందరి కూడా అటువైపుగా అడుగులు వెయ్యడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం లాంటిదే. అయితే అలా మిస్ వరల్డ్ కిరీటం కొట్టేసిన భారతీయ నారీమణులైతే గ్లామర్ ప్రపంచం అంటే.. సినిమాల్లోకి అడుగెయ్యడం అనేది చూస్తూనే ఉంటాం.
ఇప్పటికే మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మాజీ విశ్వసుందరులు సుష్మిత సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంకలు బాలీవుడ్ సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ గా మెరుస్తున్నవారే. ఇప్పుడు తాజాగా వారి లిస్ట్ లోకే ప్రస్తుత ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ కూడా చేరిపోయినట్లుగా అనిపిస్తుంది. 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మానుషీ చిల్లార్ గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అయితే మానుషీ చిల్లార్ కి ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని... ఒకవేళ మంచి ఛాన్స్ అంటే.. అమీర్ ఖాన్ వంటి నటుడు సరసన అవకాశమొస్తే మాత్రం వదులుకోనంటుంది.
మానుషీ చిల్లార్ ముంబై మీడియాతో మాట్లాడుతూ.. ఆమీర్ ఖాన్ సినిమాలు ఛాలెంజింగ్ గా వుంటాయని.... సమాజానికి మంచి సందేశాన్నిస్తాయని.... అందుకే అమీర్ లాంటి 'మిస్టర్ పర్ఫెక్ట్'తో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చెబుతుంది. మరి ఈ అమ్మడు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో తెలియదు గాని.. రాకముందే అమీర్ ఖాన్ పక్కన కర్చీఫ్ వేసేసుకుంది. మరి మానుషీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుంటుందో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే మానుషీ ఎంత అందగత్తో... అంతే మంచి డాన్సర్ కూడా. ఆ విషయం మిస్ వరల్డ్ స్టేజ్ మీద దీపికా సాంగ్ కి డాన్స్ చేసి తానొక మంచి డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. ఆ డాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.