ఎంతోకాలంగా ఎందరో ఎదురు చూస్తున్న అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె తెరంగేట్రం జరుగుతున్న విషయం తెలిసిందే. మరాఠిలో ఘనవిజయం సాధించిన 'సైరత్' చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం మరాఠీలో 4కోట్లతో నిర్మితమై 100కోట్లకు పైగా వసూలు చేసి మరాఠి చిత్రపరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాదు.. పరిధి తక్కువగా ఉండే మరాఠీ చిత్రాల మార్కెట్ పరిధిని కూడా ఇది వ్యాపింపజేసింది. ఇక ఈ రీమేక్‌లో జాన్వికపూర్ సరసన ఇషాన్‌ఖత్తర్ నటిస్తున్నాడు. కరణ్‌జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, జీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ కూడా తాజాగా విడుదలైంది. ఈమూవీకి 'ధడక్' అనే టైటిల్‌ని పెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్ర దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఇటీవల ఓ పత్రికతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జాన్వికపూర్, ఇషన్‌ఖత్తర్‌లు చాలా గొప్పవారు. వారిలో కష్టపడే తత్వం చూసి నాకు ఎంతో ముచ్చటగా ఉంది. నాకు నటీనటులలో కావాల్సింది కష్టపడే తత్వమేనని చెప్పాడు. శ్రీదేవి ఎంతో కాలం ఎన్నో అవకాశాలను కాదని చివరికి ఈ చిత్రం ద్వారా తన కుమార్తెని తెరంగేట్రం చేయిస్తుండటంతో అంతటా దీనిపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ చిత్రం ఒరిజినల్ మరాఠిలో విషాదాంత ప్రేమకథగా రూపొందింది. మరి తన కుమార్తె చేసే మొదటి చిత్రమే విషాదాంతంగా ఉండేలా? చేయడానికి శ్రీదేవి ఒప్పుకుంటుందా? అనేది సందేహమే.
కాబట్టి ఈ చిత్రాన్ని బహుశా సుఖాంతం చేసేలా కథతో మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు. దర్శకుడు కూడా సినిమాని యధాతధంగా రీమేక్ చేయడం లేదని, కేవలం సినిమాలోని మెయిన్‌పాయింట్‌ని తీసుకుని సరికొత్త సీన్స్ రాసుకున్నామని చెబుతున్నాడు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది జులై 6న విడుదల చేయాలని భావిస్తున్నారు.