ఎవరు ఎన్ని అన్నా ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది భిన్నమైన శైలి. ఆయన భగవద్గీత, యోగి పరమహంస 'ఒక యోగి కథ' వంటి వాటిని ఫాలో అవుతూ ఉంటారు. తన కర్తవ్యాన్ని, తన వృత్తి అయిన నటనను చేస్తూ మిగిలినవన్నీ కర్మకి వదిలేస్తాడు. ఆయన కర్మ సిద్దాంతం నమ్ముతాడు. ప్రతి వేసవిలో హిమాలయ పర్వతాలలో ఉన్న స్వాములు, యోగులు, ఆశ్రమాలకు ఓ సాధారణ వ్యక్తిగా, కర్రపట్టుకుని నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఎన్నో ఆశ్రమాలను కట్టించాడు. కానీ కుడి చేత్తో చేసిన దానిని ఎడమచేతికి కూడా తెలియనివ్వడు. ఇక ఆయన మిగతా హీరోలలాగా బయటికి వచ్చేటప్పుడు కూడా విగ్, మేకప్‌లతో రాడు. తెల్లగా అయిపోయిన చింపిరి గడ్డం, పిచుకగూడులో బట్టతలతో ఉండే జుట్టుతోనే కనిపిస్తాడు. ఓ సారి ఆయన్ను మీరు ఇలా కనిపిస్తే మిమ్మల్ని ఎవరు సూపర్‌స్టార్‌గా భావిస్తారు? అంటే మనం అందరికీ అలవాటు చేస్తే అలాగే స్వీకరిస్తారు. దానికి నేనే ఉదాహరణ. ఏదైనా ప్రజల మనసులను మనం ట్యూన్ చేయడంలోనే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు.
ఇక విషయానికి వస్తే ఆ రోజు ఓ అపూర్వమైన పండుగ దినం. కర్ణాటకలోని ఓ ప్రముఖ దేవాలయానికి ఆయన వెళ్లారు. దేవుని దర్శనం చేసుకుని ధ్వజస్థంభం పక్కనే అరుగు మీద నేలపై కూర్చుని తన ధ్యానంలో తాను ఉన్నాడు. అప్పుడు ఓ ధనవంతురాలు గుడిలోకి వస్తూ బిచ్చగాళ్లందరికీ తోచిన డబ్బులను దానం చేస్తోంది. అరుగుమీద కూర్చుని ఉన్న రజనీకాంత్ మాసిన బట్టలు, బట్టతల, చింపిరి జుట్టు, గడ్డం చూసి ఆయనకు కూడా పదిరూపాయల నోటు ధర్మంగా వేసింది. కానీ ఆయనలో స్పందన లేదు. ఆయన తన ధ్యానంలో తాను ఉన్నాడు. ఆమె దేవుడి దర్శనం చేసుకుని ఆలయం బయటికి వచ్చేసరికి రజనీ ఓ ఖరీదైన కారులో ఎక్కుతూ కనిపించాడు. ఆమె వెంటనే హడావుడిగా ఆయన వద్దకు వచ్చి తప్పైంది..క్షమించండి. బిచ్చగాడు అనుకున్నానని క్షమాపణకోరింది. దానికి రజనీ సమాధానం ఇస్తూ..ఇందులో నీ తప్పేమి లేదు తల్లి... నేను సూపర్‌స్టార్‌ని అనే అహాన్ని నీవు పొగొట్టావు. నేను కూడా బిచ్చగాడి వంటి వాడిని అని జ్ఞానోదయం చేశావని ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు. దటీజ్ రజనీకాంత్...!