తన కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేస్తే నాగబాబు రెచ్చిపోతాడు. ఏదో ఓ వ్యక్తిత్వ వికాసం గురించి ప్రైవేట్‌గా జరిగిన ఓ క్లాస్‌లో యండమూరి వీరేంద్రనాధ్, చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్‌కి కూడా పుట్టుకతో దవడల విషయంలో లోపం ఉందని, కానీ ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దానిని జయించాడని చెప్పినందుకు పబ్లిక్ ఫంక్షన్‌లో యండమూరి వంటి వివాదరహితుని మీద తన నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇక సోషల్‌మీడియాలో మెగా హీరోలపై సెటైర్లు వేసే వర్మని బూతులు తిట్టాడు. అంటే ఆయన కుటుంబసభ్యులని ఏమైనా ప్రైవేట్‌గా అంటే మాత్రం నాగబాబుకి అంతగా ఆగ్రహం వస్తుంది. పబ్లిక్‌లో తిడతాడు. మరి జబర్దస్త్ షోలో అనాధపిల్లలపై, వ్యక్తుల ఆకారాలు, మహిళలు అందరిపై సెటైర్లు వేస్తుంటే బిగ్గరగా నవ్వుతాడు.
స్వర్గీయ ఎన్టీఆర్‌పై, బాలకృష్ణపై వికృత పేరడీలు చేసిన పొట్టచెక్కలయ్యేలా నవ్వుతాడు. మరి ఆయన కుమారుడు వరుణ్‌తేజ్, కూతురు నిహారికలపై అలాంటి సెటైర్లే ఎవరైనా వేస్తే ఆయన ఊరుకుంటాడా? వారికో న్యాయం.. ఇతరులకో న్యాయమా? ఆయన, ఆయన కుటుంబసభ్యులు కూడా కేవలం మనుషులే కదా..? లేక ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? దేవుళ్లా? ఇక 'జబర్దస్త్'షోలో తాజాగా అనాథలపై వికృత కామెడీ పండిస్తే ఖండించాల్సిన రోజా, నాగబాబు, అనసూయ వంటి వారు పగలబడి నవ్వుతారా? అదేమైనా లైవ్‌షోనా అంటే అది కూడా కాదు. అది రికార్డిండ్ ప్రోగ్రాం. మరి షూట్ చేసిన తర్వాతనైనా ఎవరినైనా కించపరిచే డైలాగ్స్, స్కిట్స్ ఉంటే ఎడిట్ చేసే సౌకర్యం ఉంది. కానీ అది కూడా చేయడం లేదు.
ఇక ఈ విషయంలో కత్తి మహేష్ మరోసారి ఒకే దెబ్బకు రెండు పిట్టలుగా దీనిని వాడుకున్నాడు. ఆయనకు ఇప్పటికే వైసీపీకి అనుకూలం అనే విమర్శలు వస్తున్నాయి. పవన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ అట్టుడుకుతున్నారు. దీంతో ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజాని టార్గెట్ చేసి తాను న్యూట్రల్ అనిపించుకోవడంతో పాటు మెగాఫ్యామిలీపై 'జబర్దస్త్' పేరుతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఇలాంటి వికృత కామెంట్స్ చేయడంపై మండిపడ్డాడు. గతంలోనే హైపర్ ఆది తనపై ముందు పొట్ట, వెనుక బట్ట అనే సెటైర్‌కి ప్రతీకారం తీర్చుకుంటూనే ఇలాంటి చెత్త కామెడీలను చూసి పడిపడి నవ్వుతున్న రోజాపై విరుచుకు పడ్డాడు. ఓ ఛానెల్ నిర్వహించిన 'ఏది బూతు.. ఏది కామెడీ' లైవ్‌షోలో రోజా ఈమధ్య తాను 'జబర్దస్త్' వల్లనే ఎమ్మెల్యే అయ్యానని వ్యాఖ్యానించిందని, టిక్కెట్ ఇచ్చిన పార్టీ, ఓట్లు వేసిన నగరి ప్రజలు ఏమయ్యారు? ఆమె నవ్వు చూస్తే ఆమె ఎంతగా దిగజారిందో అర్ధమవుతోందని ఘాటు విమర్శలు గుప్పించాడు.
ఇదే లైవ్‌షోలో హైపర్ ఆదితో మాట్లాడించాలని ఛానెల్ ట్రై చేస్తే ఆయన స్పందించలేదు. నాగబాబు మాత్రం స్పందిస్తూ 'ఏది బూతు, ఏది కామెడీ' అని చెప్పడానికి ఈ మేధావులు, మీడియా, మహిళా సంఘాల వారు ఎవరు? దానిని నిర్ణయించాల్సింది ప్రేక్షకులు..... ఈ విషయంలో నా రెస్పాన్స్ కోసం మరోసారి ఫోన్ చేయవద్దని ఆగ్రహించడంతో ఆ హోస్ట్ నాగబాబు అన్నమాటలనే యధాతథంగా ఈ షోలో వివరించారు. ఇదేమి పైత్యం నాగబాబు.. నీహైట్‌పై, నీ నటనపై సెటైర్లువేసినా, నీ సోదరులు, కొడుకుల మీద వారి ఆకారాలు, వారి మేనరిజంలు, వారి నటనపైకూడా అలాంటి సెటైర్లే వేస్తే పెద్ద మనసుతో స్వీకరించే దమ్ముందా? దానికి నువ్వు కాదు స్పందించాల్సింది... ప్రేక్షకులు నిర్ణయించాలి? అంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి...!