మణిరత్నం ఈ మధ్యన తీసిన సినిమాలేవీ బాక్సాఫీసుని షేక్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలెవరు మణితో సినిమా అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. అయితే చిన్న హీరోతో అయినా సినిమా చేసి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. అయితే మళ్ళీ లైన్ లోకి రావాలని ఇప్పుడు ఒక మల్టీస్టారర్ సినిమాకి శ్రీకారం చుట్టాడు మణిరత్నం. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఐశ్వర్యా రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, జ్యోతికతో ఒక భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేశాడు మణిరత్నం.
ఇక ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక షూటింగ్ మొదలవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో మణి సినిమాకి పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే మణిరత్నం సినిమాలో వన్ అఫ్ ద హీరోగా తీసుకున్న శింబుని ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ దాదాపు రెండేళ్ల నిషేధం విధిస్తుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘ఏఏఏ’ అనే సినిమా విషయంలో శింబు నిర్మాతలకు సరిగ్గా సహకరించకపోవడం వల్ల. తాము చాలా నష్టపోయామని.. ఈ విషయంలో శింబుపై చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం తేలేవరకు శింబు మరే సినిమాలో నటించకుండా ఆదేశాలివ్వాలని ఆ నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే ఇలానే ఇద్దరు ముగ్గురు నటులపై ఆరోపణలు రావడంతో తమిళనాట నిర్మాతలమండలి ఆయా నటీనటులపై నిషేధం విధించే అవకాశం ఉందంటున్నారు. అందులో శింబు కూడా ఉండడంతో మణి సినిమాకి సమస్య వచ్చిపడిందంటున్నారు. మరి నిజంగా ఆ వివాదంలో శింబుపై నిషేధం విధిస్తే మాత్రం.. మణిరత్నం... శింబు ఒక్కడి కోసం షూటింగ్ వాయిదా వేసుకోవడమా.... లేదా శింబు ప్లేస్ లో మరో నటుడిని ఎంచుకుని సినిమా తీయడమా అన్నది మణిరత్నం తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మణి ఇరుక్కుపోయినట్టే.