గతంలో చిరంజీవి.. రాజశేఖర్ చేద్దామనుకున్న రీమేక్ సినిమాని చెయ్యడంతో మొదలైన చిరు - రాజశేఖర్ విభేదాలు... చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర్ దంపతులు మీద మెగా అభిమానులు దాడి చేయడంతో.. ముదిరి పాకాన పడ్డాయి. అయితే ఆ దాడి జరిగినతరువాత చిరు.. రాజశేఖర్ ఇంటికెళ్లి జీవిత దంపతులకు క్షమాపణ చెప్పడం అప్పట్లో సంచలనం అయ్యింది. అయినా కూడా జీవిత రాజశేఖర్ - చిరు ల మధ్యన విభేదాలు అలానే ఉన్నాయనేది మాత్రం జగమెరిగిన సత్యం. కానీ ఈ మధ్య మా మధ్యన ఏం లేదు కేవలం మీడియా సృష్టి అని రాజశేఖర్ మాట్లాడడం మాత్రం కాస్త విడ్డురంగానే అనిపిస్తుంది.
ఎందుకంటే రాజశేఖర్ నటించిన గరుడ వేగకి చిరు బెస్ట్ విషెస్ అందించడం.. చిరు కోసం స్పెషల్ షో వేసి సినిమా చూపించడంతో మళ్ళీ రాజశేఖర్, చిరు కలిసిపోయారని అందరికి అర్ధమయ్యేలా చేశారు. అయితే రాజశేఖర్... చిరుతో ఎలాంటి విభేదాలు లేవని గరుడ వేగ ఇంటర్వ్యూ లో చెబుతూనే ఉన్నాడు. అలాగే చిరు - మేము కొత్తగా కలిసిందేమి కాదని.. గతంలో తన కూతురి మెడికల్ సీటు కోసం తాను చిరు ఇంటికి వెళ్లి కలిసినట్లుగా రాజేశేఖర్ చెబుతున్నాడు. అసలు చిరు గారితో కొన్ని విభేదాల వలన కొన్నాళ్ళు ఆయనతో డిస్టెన్స్ మెయింటింగ్ చేసిన మాట వాస్తవమే అని... కానీ ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం అని చెప్పుకొచ్చాడు.
అంతేకాకూండా మేముసైతం ప్రోగ్రాం తర్వాత ఇంకా బాగా కలిశామని చెబుతున్నాడు. అయితే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో చిరుగారి సపోర్ట్ కోసం జీవిత.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వారింటికి వెళ్ళగానే... చిరంజీవి గారు నా గురించి అడిగారట. దీంతో జీవిత వెంటనే నాకు ఫోన్ చేసి చిరుగారింటికి రమ్మని చెప్పింది. కానీ నేను రెడీ అయి లేను. దీంతో జీవిత వెనక్కి వచ్చి మరీ నన్ను వారింటికి తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు. మాకు అవసరమైన సాయం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం... అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే రాజశేఖర్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు చిరు మీద ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడు చెప్మా.. అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.