మనం పెద్దగా భావించం కానీ నగరాలు, పట్టణాలలోని ప్రజలకు కూడా తెలియని రాజకీయాలు గ్రామాలలో ఉండేవారికి బాగా తెలుసు. ఇక ప్రతిగ్రామంలో ఎన్నో రాజకీయాలు ఉంటాయి. రాజకీయపరంగా గొడవలు, తగవులు, ఫ్యాక్షన్ రాజకీయాల వంటివి కూడా గ్రామాలలో కనిపిస్తుంటాయి. వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతి ప్రెసిడెండ్ వంటి చిన్న పదవులను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీలవుతుంటారు. ఇక విషయనికి వస్తే ఇటీవల 'లెజెండ్' నుంచి 'నేనే రాజు నేనే మంత్రి' వరకు, రాబోయే 'భరత్ అనే నేను' వరకు ఎక్కువగా రాజకీయ నేపధ్యంలో ఉండే సెటైరిక్, వాస్తవ సంఘటనలను ప్రతిబింబించే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ప్రస్తుతం రామ్‌చరణ్, సమంత, ఆది పినిశెట్టి వంటి వారితో సుకుమార్ తీస్తోన్న 'రంగస్థలం' చిత్రం కూడా 1980ల నాటి గ్రామాలలోని రాజకీయాల చుట్టూ నడుస్తుందని, ఇందులో ఎన్నో పొలిటికల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ప్రేమ, పగ, ఎమోషన్స్‌తో పాటు రాజకీయ మసాలాలను కూడా బాగా దట్టిస్తున్నారట సుక్కు. సుకుమార్ విషయానికి వస్తే సైన్స్‌ఫిక్షన్ నుంచి పాలిటిక్స్ వరకు అన్నింటిలో ఆయనకు పట్టు ఉంది. దాంతో ఈ క్రియేటివ్ డైరెక్టర్ తీస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
ఇక 'రంగస్థలం' అంటే మనం మామూలుగా నాటకాలు, ప్రదర్శనలు చేసే వేదిక అనుకుంటాం. ఈ చిత్రంలోచూపించే గ్రామం పేరు కూడా రంగస్థలమే. ఇక పల్లెల్లో ఏదైనా జరిగితే ప్రజలందరు గుమ్మికూడుతారు. దాంతో పల్లెటూరు అనేది కూడా ఒక 'రంగస్థలం' వంటిదే అని సుకుమార్ భావన. ఈ చిత్రం విషయంలో మొదట చిరంజీవి ఇలాంటి చిత్రాన్ని రామ్‌చరణ్ చేయడంపై పెద్దగా ఆసక్తిచూపలేదట. కానీ ఇటీవల రషెస్ చూసిన ఆయన ఎంతో ఎగ్జైట్ అయి, సుకుమార్‌ని అభినందించాడని సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుందని తెలుస్తోంది. అప్పటివరకు 'రంగస్థలం' రాజకీయాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే..!