అవార్డులనేవి సీనియర్ల కంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న వారికి ఎక్కువ ప్రోత్సాహాన్ని, అవకాశాలను తెచ్చిపెడతాయి. సీనియర్లకు ఇవ్వడానికి నందులు కాకుండా ఎన్నో అవార్డులు ఉన్నాయి. పద్మశ్రీని పొందిన వారికి కూడా మరలా ఎన్నో నందులు ఇచ్చినా పెద్దగా సంతోషిస్తారో లేదో కానీ అప్పుడే ఎదుగుతున్న వారి విషయంలో మాత్రం ఇవి వారి కెరీర్‌కి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇక విషయానికి వస్తే 2014 ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డును బ్రహ్మానందంకి ఇచ్చారు. నిజమే.. ఆయన 'రేసుగుర్రం' చిత్రంలో కిల్‌బిల్ పాండేగా అదరగొట్టాడు. కానీ ఆ చిత్రం విజయంలో హీరో, దర్శకనిర్మాతలకు కూడా భాగస్వామ్యం ఉంది. కానీ అదే ఏడాది వచ్చిన 'లౌక్యం' చిత్రానికి పెద్దగా స్టార్ వాల్యూ, డైరెక్టర్ వాల్యూ వంటివి లేవు. ఆ చిత్రం విజయం సాధించడానికి సగానికిపైగా 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీదే క్రెడిట్ అని ఒప్పుకోవాలి. కానీ ఆయనకు నంది అవార్డు రాలేదు.
దీనిపై పృథ్వీ మాట్లాడుతూ.. 30ఇయర్స్ ఇండస్ట్రీ అని నేను చేసిన నాటి 'ఖడ్గం' చిత్రంలోనే నీకు ఉత్తమ నటుడి అవార్డు రావాల్సింది. కానీ రికమండేషన్స్ వల్ల వేరేవారికి వెళ్లిందని ఓ జ్యూరీమెంబర్ చెప్పారు. నాటి నుంచి నేను ఆ హాలాహలాన్ని గొంతులోనే దాచుకున్నాను. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లవుతోంది. మూడేళ్ల కిందట వచ్చిన 'లౌక్యం'లో నేను నటించిన బాయిలింగ్‌స్టార్ బబ్లూ క్యారెక్టర్‌కి విపరీతమైన ఆదరణ లభించింది. దీనికి నాకు అవార్డు రాకపోవడానికి ఇందులో నేను చేసింది స్పూఫ్ పాత్ర కావడమే కారణమని అంటున్నారు. కానీ ఆ చిత్రంలో నేను చేసింది స్పూప్ట్ పాత్ర కాదు. ఓ టీవీ ఆర్టిస్ట్‌గా ఆయా పాత్రలను పోషించాను. ఇక బాలకృష్ణ, చిరంజీవి వంటి వారికి నందులేమీ కొత్తకాదు. వారి ఇళ్లలో ఎప్పటి నుంచో నందులు పరుగెడుతూ ఉన్నాయి. కానీ నా విషయంలో మాత్రం అన్యాయం జరిగింది.
అందుకే నేను ఓ నందిని కొని మా ఇంట్లో పెట్టుకుంటాను. దాని కింద ఇది 2014లో రాని నంది అని రాసిపెడతాను. అవార్డులే ప్రతిభకు కొలమానం కాదని, ప్రేక్షకుల చప్పట్లు, ఆదరణే మనకి ముఖ్యమని మోహన్‌బాబు నాతో అన్నారు. 500 చిత్రాలలో నటించిన ఆయనకు అవార్డులు రాకపోవడం, మరోవైపు కైకాల సత్యనారాయణ వంటి వారికి పద్మశ్రీలు రాకపోవడం చూస్తుంటే బాధేస్తుంది. అయినా నా ప్రతిభకు నంది అవార్డునే నేను కొలమానంగా భావించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.