సినిమా ఫీల్డ్‌లో ఎదగాలంటే అందం, టాలెంట్, గ్లామర్ షో వంటి వాటితో పాటు పర్సనల్ మేనేజర్లు, డేట్స్ చూసే పీఏలు, పబ్లిక్ రిలేషన్స్, ప్రెస్ రిలేషన్స్ చూసే పీఆర్వోల మీద కూడా నటీనటుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక మగాళ్లైతా మేనేజర్లు, పీఏలు, పీఆర్వోలు ఏమైనా తేడాలు చేస్తే తాట తీసే నటులు ఉన్నారు. కానీ హీరోయిన్లు, మరీ ముఖ్యంగా పరిశ్రమ గురించి పెద్దగా అవగాహన లేని నటీనటులను మాత్రం నమ్మిన వారే మోసం చేసి, వారి కెరీర్‌ని నాశనం చేస్తుంటారు. రెమ్యూనరేషన్స్, డేట్స్, ఏ సినిమాకి ఒప్పుకోవాలి? ఎవరితో చేస్తే భవిష్యత్తు ఉంటుంది? పర్సనల్‌గా మీడియా వ్యక్తులతో ఎలా సన్నిహితంగా ఉండాలి? వంటి అన్నింటి మీదా పరిశ్రమ తెలియని వారు వారిపైనే ఆధారపడుతారు. కానీ వారు బయట చేసే రాజకీయాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ విషయం నటీనటులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. తెలిసే సమయానికే కెరీర్ నాశనమైపోతుంది.
తాజాగా నటి అర్చన అలియాస్ వేద కూడా తన కెరీర్ నాశనం కావడానికి తన మేనేజర్లే కారణమని ఓపెన్‌గా చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్లనే ఇండస్ట్రీలో రావాల్సిన అవకాశాలు రాకుండా పోయాయి. వారి వల్ల చాలా ఇబ్బంది పడ్డాను, వారు నేను తీసుకునే రెమ్యూనరేషన్‌ని నాకు పోటీగా ఉన్న హీరోయిన్లకు సీక్రెట్ చెప్పేసేవారు. దాంతో ఆయా హీరోయిన్లు నిర్మాత, దర్శకులతో అంత కంటే తక్కువ రెమ్యూనరేషన్‌కే చేస్తామని ముందుకు వచ్చి నా అవకాశాలను వారు చేజిక్కించుకునేవారు. కొందరైతే నేను తీసుకునే రెమ్యూనరేషన్‌నిి కూడా కావాలని పెంచి చెప్పి, నాకు అవకాశాలు రాకుండా చేశారు.
నన్ను మాత్రమే పెట్టుకోవాలని నిర్ణయించుకునే దర్శకనిర్మాతలకు నా ఫోన్‌నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్లు, నన్ను ఎలా కలవాలో చెప్పేవారు కాదని తెలిసింది. మరికొన్ని సార్లు మా మేనేజర్లు ఆమె సినిమాలు మానేసింది. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. మీ చిత్రంలో నటించనని చెప్పింది అని దుష్ప్రచారం చేసేవారు. ఇక నేను మొదటి నుంచి రెమ్యూనరేషన్ కంటే స్క్రిప్ట్ బాగుంటే చాలని నా మేనేజర్లకు చెప్పినా వారు మాత్రం నాపై నిందలు, అబద్దాలు చెప్పేవారు. దాంతో నేను ప్రస్తుతం మేనేజర్లను తీసేసి నా నిర్మాత, దర్శకులతో అన్ని నేనే డైరెక్టగా మాట్లాడుతున్నానని తెలిపింది.