నంది అవార్డుల వివాదం సద్దుమణుగుతున్న సమయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరలా అగ్నికి ఆజ్యం పోశాయి. నాన్ ఆంధ్రా పీపుల్‌గా, నాన్‌లోకల్‌గా కొందరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీకి కూడా 10ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదేననేది అందరికి తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ వంటి ఎందరికో నిన్నమొన్నటి వరకు ఏపీలో ఓటు హక్కు, ఆధార్‌కార్డులు లేవు. ఇక హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కడుతూ, తమపై విమర్శలు చేస్తున్నారనే లోకేష్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. బ్రాహ్మణి, భువనేశ్వరి నుంచి వసుంధర, నందమూరి వంశస్తులందరూ తమ వ్యాపారాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తూ పన్నులు కడుతున్నారు.
ఇటీవలే చంద్రబాబు, లోకేష్‌లు కోట్ల ఖర్చుతో హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారు. ఇక లోకేష్ వాదన ప్రకారం చూస్తే బాలకృష్ణ ఎమ్మెల్యే, తనకు మామ, ముఖ్యమంత్రికి బావమరిది అయినా ఇంకా హైదరాబాద్‌లోనే క్యాన్సర్ హాస్పిటల్‌తో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయాలను, సేవలను అందిస్తున్నారు. మరి ఏపీలోని అన్ని ప్రాంతాల వారికి ఈ సేవలు ఎందుకు అందించరు? మరో విషయం ఏమిటంటే. ఆధార్-ఓటర్ కార్డులేని వారు ప్రశ్నిస్తూ గొడవలు చేస్తున్నారని లోకేష్ అన్నాడు. మరి టిడిపి ప్రభుత్వమే ఈ మూడు ఏళ్లకు గాను ఏర్పాటుచేసిన జ్యూరీలో ఎందరికి ఏపీలో ఆధార్-ఓటర్‌కార్డులున్నాయో చెప్పాలి.
ఇక దీనిపై మందుతాగి అర్ధం లేకుండా వాగుతున్నాడని పోసాని ఓ వైపు ఘాటుగా లోకేష్‌ని విమర్శిస్తు, 'టెంపర్' చిత్రానికి గాను తనకువచ్చిన 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నంది అవార్డును తీసుకోనని, తీసుకుంటే' కమ్మోడివి కాబట్టి ఇచ్చారంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ.. పోసాని గారూ మీరు ఆ అవార్డుకి100శాతం అర్హులు, మనం ఏపీలోనే పుట్టాం.. చదువుకున్నాం, ఏపీ యాసలోనే మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు కొత్తగా ఏపీ వారిమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మరోవైపు తమ్మారెడ్డిభరద్వాజ ఇక నుంచి లోకేష్ 'ఆధార్ కార్డ్' అవార్డులు ఇవ్వాలని సెటైర్ వేస్తూ అజ్ఞానంతో తండ్రి పరువును తీయవద్దని సూచించాడు.