గత కొన్నేళ్లుగా తమిళంలో హిట్ అయిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయినప్పటికీ సో.. సో టాక్ తో యావరేజ్ హిట్స్ సొంతం చేసుకుని..... ఎప్పుడూ తెలుగు సినిమాలపై పెద్దగా పై చేయి సాధించే సీన్ లేకపోయేవి. కానీ ఇప్పుడు తాజాగా ఈ నెలలోనే రెండుసార్లు తెలుగు సినిమాలను తొక్కేసి తమిళ డబ్బింగ్ సినిమాలు తమ హవాని కొనసాగిస్తున్నాయి. గత రెండు వారాలనుండి ఇదే పరిస్థితి కనబడుతుంది. గతవారం విజయ్ అదిరింది సినిమా.... విశాల్ డిటెక్టీవ్ సినిమాలు పై చెయ్యి సాధించి మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు, సందీప్ కిషన్ నటించిన కేరాఫ్ సూర్యలు సోదిలోకి లేకుండా పోయేలా చేశాయి.
ఇప్పుడు తాజాగా ఈ శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈ వారం తెలుగునుండి దాదాపు ఆరేడు సినిమాలు విడుదల కాగా తమిళం నుండి వచ్చిన రెండు డబ్బింగ్ సినిమాలు తమ ప్రతాపాన్ని చూపెట్టాయి. అసలు తెలుగు సినిమాలకు రివ్యూ రాసే నాధుడే లేకపోయాడంటే ఈ వారం తెలుగు సినిమాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతుంది. ఈ శుక్రవారం విడుదలైన ఖాకీ సినిమాతో పాటు గృహం సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. కార్తీ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా పోలీస్ స్టోరీతో... ఖాకీ ఎలా ఉండాలో చూపించిన ఖాకీ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
మరోపక్క సిద్దార్ధ్ - ఆండ్రియా జంటగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా గృహం కూడా హిట్ టాక్ తెచ్చుకుని క్రిటిక్స్ నుండి ఫుల్ మార్కులు వేయించుకుంది. మరి ఈ రెండు సినిమాల్తో పోటీపడలేక.. తెలుగు సినిమాలైనా లండన్ బాబులు, స్నేహమేరా జీవితం వంటి సినిమాలు గప్ చుప్ గా సైడ్ అయ్యాయి. మరి రెండు వారాలతో తెలుగు సినిమాలను తొక్కేసి తమిళ సినిమాలు తమ పవర్ చూపిస్తున్నాయి. ఇక ఈ నెల చివరి వారమైనా.. ఒక్క తెలుగు సినిమా అయినా బెస్ట్ అనిపించుకుంటుందేమో చూద్దాం.