నంది అవార్డులు ఇంత పెద్ద వివాదాలకు దారి తీస్తాయని బహుశా ఏపీ ప్రభుత్వం గానీ, జ్యూరీ మెంబర్స్ కూడా భావించి ఉండరు. ఇక సగటు సినీ అభిమాని మాత్రం కేవలం రెండు చిత్రాల విషయంలోనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటిది 'రుద్రమదేవి', రెండోది 'మనం'. ఇక మంచి సినిమాకి అవార్డులు వస్తే ఆ చిత్రాల వల్ల ఆర్థికంగా నష్టపోయినా ఆత్మసంతృప్తి మిగులుతుంది. కళాకారులకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు..... పేరు, ప్రతిష్టలు, కీర్తి, ప్రేక్షకుల అభినందనలు, అవార్డుల వంటివి ఆర్థిక నష్టాల బాధకు కాస్తైనా ఊరడింపు లభిస్తుంది. అందరూ తన ప్రతిభను గుర్తించారని, తాను పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని భావిస్తారు. ఇక 'మనం' విషయానికి వస్తే ఏయన్నార్, నాగార్జున వంటి వారికి ఇప్పుడు అవార్డుల వల్ల వారికి ప్రత్యేకంగా ఒనగూరేది ఏమీ లేదు. వారు ఆల్‌రెడీ తమ స్థాయి ఏంటో చూపించారు. ఇక నాగార్జునకి ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్‌నే ఇచ్చింది. ఆయన ఆర్ధిక పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇలాంటి అవార్డులను, రివార్డులను ఏయన్నార్, నాగ్‌లు ఎన్నో చూశారు.
కానీ గుణశేఖర్ విషయానికి వస్తే మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది. డైరెక్టర్‌గా ఆయనకు డిజాస్టర్స్ కూడా ఉండి ఉండవచ్చు. బట్ ఆయనో గ్రేట్ టెక్నీషియన్. 'సొగసుచూడతరమా'తో పాటు పిల్లలతో ఏకంగా 2వేల మంది చైల్డ్ ఆర్టిస్టులతో 'బాలరామాయణం' తీసినప్పుడే ఆయన ముద్ర కనిపించింది. అభినవ బాపుగా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. అలా ఓ తపనతో పనిచేసే గుణశేఖర్ కోట్లు ఖర్చు పెట్టి అనుష్క, రానాలతో భారీ బడ్జెట్‌తో 'రుద్రమదేవి' తీశాడంటే నిజంగా ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ అర్ధమవుతుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆస్థులన్నీ అమ్ముకున్నాడు. ఇక బన్నీ ఉచితంగా చేశాడా? లేదా? అనేది పక్క విషయం. అది కూడా నిజమేనని నిర్మాత ఎన్వీప్రసాద్ చెప్పాడు. కావాలంటే లైవ్‌లోనే గుణశేఖర్‌కి ఫోన్ చేసి అడగండి అని చానెల్‌లో వచ్చిన డిబేట్‌లో సవాల్ విసిరాడు. ఇక ఆయన చిత్రానికి కనీసం పన్ను రాయితీని కూడా ఇవ్వకపోవడం దారుణం. ఆయనో చెత్త సినిమా తీసి డబ్బు, పేరును పొగొట్టుకుంటే అది వేరే విషయం. కానీ ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ ఓ వీరనారి చరిత్రను కసిగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి అవార్డులు వస్తే ఫ్లాప్‌లో ఉన్న తనకు కొందరైనా మరలా దర్శకత్వం ఇవ్వడానికి, తనపై నిర్మాతలు, హీరోలు నమ్మకం ఉంచుతారనేది ఆయన ఆశ. కానీ 'రుద్రమదేవి'కి జరిగిన అన్యాయం మాత్రం అంతా ఇంతా కాదు..ఆయన కష్టం, డబ్బు అన్ని బూడిదలో పోసిన పన్నీరైందని భావిస్తే ఆ తప్పు గుణశేఖర్‌ది కాదు. అవార్డులని ఎంపిక చేయడం చేతకాని సభ్యులది, ఏపీ ప్రభుత్వానిదే అవుతుంది..!