చిరంజీవి 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఈ చిత్రాన్ని అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు. ఈ వేడుకకి దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యాడు. 'సై రా' మోషన్ పోస్టర్ తో పాటు ఈ సినిమాలో నటించే నటులు, టెక్నీషియన్ లిస్ట్ ను కూడా ఎంతో గ్రాండ్ గానే విడుదల చేశారు. అమితాబ్, నయనతార, విజయసేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుదీప్ వంటి పలుభాషా నటీనటులు ఈచిత్రంలో నటిస్తున్నారని... అలాగే ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడిగా, రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా 'సై రా' కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే సినిమా సెట్స్ మీదకెళ్ళకముందే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ విషయంలోనూ, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ విషయంలోనూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీరిద్దరూ 'సై రా' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని. రెహ్మాన్ మాట ఎలా వున్నా రవివర్మన్ మాత్రం 'సై రా' నుండి బయటికొచ్చేశాడు. కారణాలు మాత్రం క్లారిటీ లేదు. అయితే 'సై రా' నుండి తప్పుకున్న రవివర్మన్ తాజాగా బాలకృష్ణ - తేజ కలయికలో రాబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' లో ఛాన్స్ కొట్టేశాడట. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా వున్న తేజ ఇప్పుడు టాప్ టెక్నిషియన్స్‌ని ఎంపిక చేసే పనిలోపడ్డాడట.
అందులో భాగంగానే తేజ సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ని ఎంపిక చేశాడంటున్నారు. తేజ కున్న పాత పరిచయంతోనే రవివర్మన్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తేజ, రవివర్మన్ గతంలో 'జై' చిత్రానికి కలిసి పనిచేశారు. మరి టాప్ టెక్నీషియన్ రవివర్మన్ తోపాటు ఎన్టీఆర్ బయోపిక్ సంగీత దర్శకుడిగా తేజ... కీరవాణిని తీసుకున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.