పరుచూరి బ్రదర్స్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సిడ్నీలోని తెలుగు సంఘం వారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుని ఇచ్చింది. ఈ సందర్భంగా పరుచూరి సిడ్నీలో మొత్తం ఎంత మంది తెలుగువారు ఉంటారు అని అడిగితే 36వేల మంది అని చెప్పారు. కానీ తెలుగు సంఘంలో మాత్రం మూడొందల మందే ఉండటం బాధేసిందని. ఆడిటోరియంకు వెళ్లితే మొదట రెండు వందల మందే ఉన్నారని తెలిపారు. ఇక ఈ విషయంపై 'అందరూ కలుసుకోండి. కలుపుకోండి.. హృదయానికి, హృదయానికి అడ్డుగోడ కడితే కలుసుకోలేం. హృదయానికి హృదయానికి మద్య వంతెనలు నిర్మించండి. మనిషికి ఎన్నో పరిమితులు ఉన్నాయి. కానీ మేథస్సుకి పరిమితులు లేవు. రోజూ మనం వంటికి టీ,కాఫీ,టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇచ్చినట్లుగానే మెదడుకి కూడా రోజు ఫీడింగ్ ఇవ్వాలి. మన మెదడుకి ఫీడింగ్ ఇస్తూ ఉంటేనే మనం ఎదుగుతాం' అని చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయిందట.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'మేము ఎన్నో ఊర్లు, ఎన్నో దేశాలు తిరిగాం. కానీ సిడ్నీలోని ఆడపడుచులు వంటి వారిని ఎక్కడా చూడలేదు. ఆ వీధులు చూస్తుంటే లండన్ వీధుల్లాగా ఉన్నాయి. ఇక నా వద్దకు వచ్చి ప్రతి తల్లి తమ బిడ్డలచేత కాళ్లకు నమస్కారం చేయించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నేనేమీ వేదపండితుడిని కాదు. కానీ సినిమా రచయితగా కూడా వారు నాపట్ల చూపిన అభిమానం మరిచిపోలేను. అక్కడ ఓరోజు ఓ ఇంట్లో ఉదయం టిఫిన్ చేస్తుండగా ముందు రోజు రాత్రి ఉన్న ఇంటి వారి నుంచి ఫోన్ వచ్చింది. ఆవిడ మాట్లాతుడూ.. ప్రతి శుక్రవారం నేను అమ్మవారికి పూజ చేస్తాను. శనివారం వచ్చిందంటే అమ్మవారు మా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా బాధపడతాను. రాత్రి మీ అన్నదమ్ములిద్దరు వెళ్లిపోయిన తర్వాత నాకు అలాంటి ఫీలింగే కలిగిందని చెప్పడంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడి అక్కా చెల్లెళ్లు చూపే ఆప్యాయత అలా ఉంది..' అని పరుచూరి ప్రశంసలు కురిపించాడు.