ఉత్తమ చిత్రాలకి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేడు అందించే అవార్డ్స్ నంది అవార్డ్స్. ఈ అవార్డ్స్ సినిమాలకి, అందులో పని చేసిన నటీనటులకు, సాంకేతిక వర్గానికి ఇస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం నంది అవార్డ్స్ ప్రకటించాక.... దానిపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇద్దరో ముగ్గురో మనకు నంది రాలేదని బాధ పడటం కూడా మాములే.
అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నదులపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదే ఇష్యూపై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిస్కషన్ లో మెగా ఫ్యామిలీ వీరాభిమాని బండ్ల గణేష్ గట్టి కౌంటరే వేశాడు. ఈసారి ఇచ్చింది నంది అవార్డ్స్ కాదని సైకిల్ అవార్డ్స్ అని పంచ్ వేసాడు. అవార్డ్స్ విషయంలో మొదటి నుండి మెగా ఫ్యామిలీని దూరం పెడుతున్నారని.. ఇది ఎప్పుడు జరిగేదే అని గణేష్ మండిపడ్డాడు.
‘ఎండాకాలం ఎండ కాస్తుంది.. వానాకాలం వానలు పడతాయి.. శీతాకాలం చలేస్తుంది.. అలాగే ఇది టీడీపీ కాలం. వాళ్లేం చెబితే అది వినాలి. లేదా ఇంకో కాలం వచ్చేదాకా వెయిట్ చేయాలంటూ'... అంటూ భారీ సెటైర్ వేశాడు. తాను నిర్మాతగా వ్యవహరించిన గోవిందుడు అందరివాడే సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రం వస్తుందని ఆశించానని.. చరణ్ కు కచ్చితంగా అవార్డు వస్తుందని అనుకున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. దీంతో గణేష్ తో పాటు డిస్కషన్ లో పాల్గొన్న మిగతా వారికి ఈ పంచెస్ గట్టిగానే... తగిలాయి.