దేశం గర్వించదగ్గ నటుల్లో, నేటి తరం కూడా తన హవా చాటుతున్న నటుడు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎమ్జీఆర్, శివాజీగణేషన్, కన్నడ కంఠీరవ రాజకుమార్ వంటి వారి మరణం తర్వాత అత్యంత సుదీర్ఘమైన కెరీర్, ఫేమ్ ఉన్నది ఒక్క అమితాబ్‌కేనని గర్వంగా చెప్పవచ్చు. కాగా ఈయనకు అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. నాగార్జునని హిందీలో కూడా నటించమని ప్రోత్సహించిన వారిలో ఆయన ఒకరు. అంతేకాదు... ఆయన నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుని 'ఖుదాగవా'వంటి చిత్రాలలోనే కాదు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటించాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా, ఏయన్నార్ చివరి కాలంలో చేసిన 'మనం' చిత్రంలో ఆయన ఓ గెస్ట్‌రోల్‌లో కనిపించాడు.
ఇక ప్రస్తుతం ఆయన చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సై.రా..నరసింహారెడ్డి'లో కూడా కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆయన నటిస్తేనే తాను కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చిత్రం చేస్తానని చెప్పి మరీ బాలయ్య, కృష్ణవంశీలు కలిసి 'సర్కార్ 3' షూటింగ్ స్పాట్‌కి వెళ్లి అడిగినా ఆయన నో చెప్పాడు. ఇక తాజాగా సమాచారం ప్రకారం ఈనెల 20న షూటింగ్ ప్రారంభించుకోనున్న నాగార్జున-రాంగోపాల్‌వర్మల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో చిన్ననిడివి ఉన్న పాత్రే అయినా, కథను మలుపు తిప్పే పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటు నాగార్జునకే కాదు, అటు వర్మని మెచ్చి, ఆయనను ఎంతగానో అభిమానం చూసే వ్యక్తి అమితాబ్. దాంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నాడనే వార్తలకు బలం చేకూరుతోంది. వర్మ పైకి అమితాబ్ నటించడం లేదు అని చెబుతున్నా.. బిగ్ బి కోసం పాత్ర మాత్రం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక ఈ చిత్రం 'శివ' కంటే హైరేంజ్‌లో ఉంటుందని, ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ్ నటిస్తాడని తెలుస్తోంది. తన చిత్రాల గురించి ముందుగానే పెద్దగా భజన చేసే అలవాటు లేని నాగ్ సైతం ఈచిత్రంతో వర్మ 'శివ' తర్వాత ఆ స్థాయిలో వెలిగిపోతాడని చెబుతున్నాడు. ఇక ఈ చిత్రంలో టబు నటించనుందనే వార్తలను ఇప్పటికే యూనిట్ ఖండించింది. మరి అమితాబ్ విషయంలో మాత్రం వర్మ ఖండించినా.. వార్తలు మాత్రం ఆగడం లేదు.