గొప్ప అయిన తర్వాత, హీరోగా పేరు ప్రఖ్యాతలు సాధించిన తర్వాత లోకం మొత్తం ఆయనకు అది చేశాం.. ఇది చేశాం.. అని అంటూ ఉంటుంది. కానీ కెరీర్‌లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నరోజుల్లో మనల్ని ఆదరించి, ప్రోత్సహించే వారే నిజమైన శ్రేయోభిలాషులు. అలాంటి వారిని మనం ఆజన్మాంతం గుర్తుంచుకోవాలి. ఇక విషయానికి వస్తే సందీప్‌కిషన్‌కి ఆయన మేనమామ చోటా కె నాయుడు వల్లే అవకాశాలొస్తున్నాయనే ప్రచారం ఉంది. ఇక ఆయన మేనమామ కావడంతో ఆ మాత్రం కేరింగ్, జాగ్రత్త, సపోర్ట్‌లు సహజం. దానిపై సందీప్‌కిషన్ మాట్లాడుతూ, చోటా కె నాయుడు నాకు మేనమామ కాబట్టి నాపై ఇష్టం ఉండవచ్చు.
కానీ ఎందరితోనో చిత్రాలు తీసిన జెమిని కిరణ్ అంటే మాత్రం నాకు ఎక్కడలేని అభిమానం. ఆయన నాకు ఇండస్ట్రీలో తండ్రిలాంటి వారు. ఆయనతో నాకేమీ రక్తసంబంధం లేదు. కానీ ఆయన మాత్రం నా మంచినే కోరుకుంటూ, అండగా నిలుస్తూ ఉంటారు. ఇక రెండో వ్యక్తి నిర్మాత అనిల్‌సుంకర. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనతో 'రన్' చిత్రం చేసేటప్పుడు ఆర్ధికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ ఆయన నా పరిస్థితి గమనించి మేము అనుకున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ మొత్తాన్ని నాకు పంపించారు.
మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అయ్యో అనేవారే గానీ, పక్కనుండి మాటలు చెప్పేవారు ఉన్నారే గానీ అనిల్‌సుంకర అలాంటి వ్యక్తికాదు. ఆయన ఆపదలో అందరినీ ఆదుకుంటారు. వారిద్దరికి నేను రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. నిజంగా సందీప్‌కిషన్‌కి వారిద్దరి మీద ఉన్న కృతజ్ఞతలు, అవసరం తీరగానే పట్టించుకోవడం వదిలేసే మనుషులున్న నేడు వారు చేసిన సహాయాలను గుర్తుంచుకుని గొప్పగా చెప్పుకోవడం సందీప్‌కిషన్ మంచితనం. ఇలాంటి స్నేహితులు అందరికీ దొరకరు కదా..!