హీరోలకు అభిమానులు ముఖ్యమే. దానిని ఎవరు కాదనరు. కానీ వారిని సరైన దారిలో నడిపించే విషయంలో హీరోలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటాయి. వీరాభిమానులు అత్యుత్సాహంతో చేసే పనులు ఆ హీరోలపై మరకగా మిగిలిపోతాయి. చిరంజీవి విషయంలో ఆయన అభిమానులు రాజశేఖర్ మీద చేసిన దాడి కూడా అదే కోవలోకి వస్తుంది. కానీ వెంటనే చిరు రియాక్ట్ అయి రాజశేఖర్, జీవితల ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చాడు. ఇక పవన్ విషయంలో కూడా ఆయన వీరాభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తమ హీరో గురించి మాట్లాడితే దాన్నో పెద్ద వివాదంగా మార్చి, వీధిని పడుతున్నారు. ఈ విషయంలో పవన్ కూడా మౌనంగా ఉండటం బాధాకరం.
అల్లు అర్జున్ విషయంలోనే కాదు.. తాము వచ్చిన ఏ ఫంక్షన్‌లో అయినా సంబంధంలేని చోట పవన్.. పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమ చిత్రం ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తమ సినిమా గురించి మాట్లాడాలని భావించే వారికి ఇది చాలా ఇబ్బందికర పరిణామం. ఇక కత్తి మహేష్ విషయానికి వస్తే కూడా ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది తప్పితే, తన అభిమానుల విషయంలో పవన్ మౌనంగా ఉండటం ప్రమాదకరం. అభిమానులు కూడా జనాలే గానీ జనాలందరూ ఆయన అభిమానులు కాదు. ఆయనంటే పడని వారు, ఆయన వ్యవహారశైలి నచ్చని వారు కూడా ఉంటారు. ఇక తాజాగా తప్పు పవన్ ఫ్యాన్స్‌దా? లేక కత్తిమహేష్‌దా? అనే విషయం పక్కనపెడితే, పవన్ తన అభిమానుల వైఖరిపై ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు? తన అభిమానులు ఏమి చేసినా అది కరెక్ట్ అనే ధోరణిలో ఉన్నాడా? ప్రశ్నించడానికి రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన ఆయనను ప్రశ్నిస్తే మాత్రం ఆయన అభిమానులు ఎందుకలా రెచ్చిపోతున్నారు?
తాజాగా కత్తి మహేష్ కూడా ఓ వాల్యుబుల్ పాయింట్‌ని లేవనెత్తాడు. పవన్‌కి తన అభిమానులు చేస్తోన్న ఓవర్‌యాక్షన్ గురించి బాగానే తెలుసునని కానీ ఆయన చూస్తూ మౌనంగా ఉంటున్నాడని తేల్చాడు. పవన్‌ని దేవుడు అంటున్నారు? ఆ వ్యక్తిని దేవుడిలా ఎలా భావిస్తారు? ఇక పవన్ నుంచి తన అభిమానుల విషయంలో స్పందన రావాలి. ఆయన నాపై నెగటివ్‌గా స్పందిస్తాడా? పాజిటివ్‌గా స్పందిస్తాడా? అనేది ఆయన ఇష్టం. కానీ ఆయన మాత్రం ఫ్యాన్స్ విషయంలో స్పందించాలి. లేదా నా ఫ్యాన్స్ ఇంతే.. మీ ఖర్మ మీరు చావండి అంటే దానికి కూడా నేను ఓకే. ఆయన ఈ విషయంలో ఏ విధంగా స్పందించినా కూడా నేను ఆయనకు దాసోహం అంటాను. ఆయన రాజకీయాలను ప్రక్షాళన చేసే దేవుడు అంటున్నారు. ఆయన ఎలాంటి దేవుడో చూస్తానని కత్తి మహేష్ సవాల్ విసిరాడు.