మన పెద్దలు మగవారి సంపాదన, ఆడవారి వయసు అడగకూడదని అంటారు. మగవారి సంగతేమో గానీ ఆడవారి వయసు అడిగితే ఇంతెత్తున లేస్తారు. ఇక నటీమణులు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి వయసుని అడిగితే పుట్టిన తేదీ చెబుతారేమో గానీ పుట్టిన సంవత్సరం మాత్రం చెప్పరు. ఇక చక్కనమ్మా చిక్కినా అందమే, బొద్దుగా మారినా అందమే. ఈ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏం.. ఈ మధ్య కాస్త లావు పెరిగారే? కాస్త సన్నబడ్డారే? వంటి ప్రశ్నలను మనం కుశల ప్రశ్నలుగా భావిస్తాం. కానీ అదే మాట హీరోయిన్లని అడిగితే మాత్రం తన్నినంత పని చేస్తారు. దానిని ఓ బూతుగా భావిస్తారు. చాలా మంది హీరోయిన్లు లావు పెరగడం, సన్నబడడటం, పాత్రల కోసం కూడా బొద్దుగా మారుతుండటం చూస్తుంటాం. దాంతో విలేకరుల నోర్లు కామ్‌గా ఉండవు కదా..! ఏం మేడమ్... బరువు పెరిగినట్లుగా ఉన్నారు. మరలా నాజూకుగా మారి ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తారు? అనేది సహజమైన ప్రశ్నే. ఈ కోవకి చెంది లావుగా ఉన్న, లావుగా పెరిగిన ప్రతి ఒక్క హీరోయిన్‌కి వారి శరీరాకృతిపై ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి.
'సైజ్‌జీరో' తర్వాత అనుష్క, అంతకు ముందు ఖుష్బూ, నమిత, రాశిఖన్నా వంటి ఎందరో పాత్రల కోసం బరువులు పెరిగారు. మరలా నాజూకుగా మారాదు. ఇక ఈ కోవలోకి విద్యాబాలన్ కూడా వస్తుంది. కొత్తకొత్త అందాలను ప్రదర్శించే భామలు సినీ రంగ ప్రవేశం చేయడంతో ఈమె ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాలైన 'డర్టీపిక్చర్, బేగంజాన్' వంటి చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె 'తుమ్హారీ సులు' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సురేష్‌త్రివేణి దర్శకత్వం వహించారు. కేవలం 42 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులో విద్యాబాలన్ సామాన్యమైన మహిళగా, లేట్‌నైట్ రేడియో జాకీగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విలేకరి.. మేడమ్ మరలా ఎప్పుడు సన్నబడతారు? ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తారు? అని క్యాజువల్‌గా అడిగాడు.
దాంతో ఆమె శివంగిలా పైకి లేచి, ముందు మహిళలను చూసే నీ ధోరణిని మార్చుకో...మహిళల విషయంలో మీ ఆలోచనా ధోరణిని మార్చుకోండి.. నా పాత్రలతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా నా పాత్రలకి, బరువు తగ్గడానికి ఏమైనా సంబంధం ఉందా? అని ఘాటుగా ప్రశ్నిస్తూనే మొహాన నవ్వును చెదరనివ్వలేదు. మరి సినిమా ప్రమోషన్‌లో కేవలం వారు చెప్పిందే విని దానినే రాసుకోవాలా? ఇక వారిని ప్రశ్నలంటూ వేయకూడదా? అలా అయితే ఓ ప్రెస్‌నోట్ పంపిస్తే సరిపోతుంది. దాని కోసం విలేకరులను పిలిచి ప్రశ్నలు వేయమనడం దేనికి? ఏది అడిగినా కోపం తెచ్చుకునే దానికి మీడియాకు దూరంగా ఉంటే ఏ బాధ ఉండదు కదా!