ఎక్కడో ఎప్పుడో ఓ ఎన్టీఆర్, ఓ ఎమ్జీఆర్, జయలలిత వంటి నటులే రాజకీయాలలో బాగా రాణించారు. ఇక చిరంజీవి, అమితాబ్‌బచ్చన్.. ప్రస్తుతం బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, ఉపేంద్ర, రజనీకాంత్, కమల్‌హాసన్, శరత్‌కుమార్, విజయ్‌కాంత్, విజయశాంతి, కార్తీక్ వంటి ఎందరో రాజకీయాలలోకి వచ్చారు. ఈ కోవలోకి వచ్చేందుకు ఎన్నికల లోపు మరికొందరు రెడీ అవుతున్నారు. ఇక సినిమా నటులే కాదు.. ఎవరికైనా రాజకీయాలలోకి వచ్చే స్వేచ్చ, సొంతగా పార్టీ పెట్టుకునే హక్కు ఉండవచ్చు. కానీ అమితాబ్, సత్యనారాయణ, కృష్ణ, చిరంజీవి, కోటశ్రీనివాసరావు, బాబూమోహన్... ఇలా ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించినా కూడా వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయ్యారు.
ఇక సొంతంగా పార్టీ పెట్టిన వారిని పక్కనపెడితే పలు పార్టీల తరపున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీచేస్తున్న పలువురు ఇటు సినిమాలలో నటిస్తూనే మరోవంక రాజకీయాలు చేయాలని భావించేవారు. కానీ వారు రెండింటికి న్యాయం చేయలేకపోవడం వల్ల మొదటి సారి గెలిచినా రెండు మూడు సార్లలోపే కనుమరుగవుతున్నారు. తన సొంత నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేసిన రామానాయుడే మొదట్లో గెలిచినా తర్వాత ఓడిపోయాడు. ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టడంతో పాటు సినీ నటులు రాజకీయంగా ఎదగలేక పోవడానికి తాజాగా ప్రకాష్‌రాజ్ చెప్పిన మాటలు కూడా నిజమే. ఆయన మాట్లాడుతూ, సినిమా వారికి అన్ని వర్గాలు, అన్ని చోట్లా అభిమానులుంటారని, కులమతాలకతీతంగా ఉండే అభిమానులు సినీ నటులు రాజకీయాలలోకి వస్తే చాలా వర్గాలకు దూరం కావాల్సివస్తుందని, అభిమానుల పట్ల బాధ్యతాయుతంగా ఉండేవారెవ్వరైనా రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పాడు.
సినిమా వారు రాజకీయాలలోకి వస్తే దేశం నాశనం అవుతుందని, అందువల్లే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. సినీనటులు రాజకీయాలలోకి రావడం, పార్టీ పెట్టడం వంటివి తాను సమర్ధించనని చెప్పాడు. ఇది కూడా నిజమే. చిరంజీవి కూడా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అందరివాడు కాస్తా కొందరివాడైపోయాడు. ఇక పవన్ నుంచి రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు కూడా భవిష్యత్తులో ఇదే వర్తిస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.