బాలీవుడ్‌లో స్టార్ లు పారితోషికం తీసుకోరు. సినిమాలలో వాటాను లేదా రైట్స్‌ని తీసుకుంటారు. అమీర్‌ఖాన్ అయితే సినిమా మొత్తం పూర్తయి, చివరి బోయ్‌కి కూడా రెమ్యూనరేషన్ ఇచ్చి, సినిమా విడుదలైన తర్వాత లాభాలు వస్తేనే దానిలో వాటా తీసుకుంటాడు. అలా ఆయనకు 'దంగల్' చిత్రం ద్వారా 70-80కోట్లు వచ్చాయట. అదే సినిమా ఫ్లాపయితే తన బాధ్యతగా పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోడు. బయ్యర్లకు కూడా లాభాలు వచ్చాయంటే అప్పుడు మాత్రమే షేర్ తీసుకుంటాడు. ఈ పద్దతి హీరోలు ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమాలు చేయడానికి, నిర్మాతలు బడ్జెట్, మార్కెట్‌ని సరిచేసుకోవడానికే కాదు.. బయ్యర్లకు కూడా ఇది సేఫ్. కానీ మన స్టార్స్ అంత పెద్ద సాహసం చేయకపోయినా దాదాపు అదే రూట్‌లో నడుస్తున్నారు. వారు సినిమాలలో షేర్ తీసుకుంటున్నారు. మరోపక్క షేర్‌తో పాటు ఏదైనా ఏరియా రైట్స్‌ని కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ఉదాహరణకు 'జై లవకుశ' హిట్ అని ఎన్టీఆర్ మీడియాను కూడా తిట్టాడు. ఈ చిత్రం థియేటికల్ రైట్స్, ఆడియో, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా దాదాపు 110కోట్లవరకు బిజినెస్ చేసింది. ఏకంగా థియేటికల్ రైట్స్‌నే 85కోట్లకు అమ్మారు. కానీ ఈ చిత్రం 50రోజుల లాంగ్‌రన్‌లో సాధించింది కేవలం 75 కోట్ల షేర్ మాత్రమే. దీని వల్ల నిర్మాతకి బాగానే లాభాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఖాతాలోకి 40కోట్ల వరకు వచ్చాయి. 30కోట్లతో సినిమా ఫినిష్ చేయడం వల్ల నిర్మాత, హీరో అందరూ లాభపడ్డారు. కానీ బయ్యర్లే హిట్ సినిమాకి కూడా 10కోట్లు నష్టపోవాల్సివచ్చింది.
కాబట్టి ఇకనుంచి బయ్యర్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్ రిఫండబుల్ అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి ఉండాల్సి ఉంది. ఇక తాజాగా హీరో, డైరెక్టర్ల పారితోషికంలో 25 శాతం సినిమా రిలీజ్ అయ్యేదాకా నిర్మాత వద్దనే ఉంచాలని, సినిమా ఫ్లాప్ అయితే ఆ మొత్తాన్ని బయ్యర్లకు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇది కూడా నిర్మాతలకు లాభదాయకంగా ఉంటుంది గానీ మరో పని చేతగాని బయ్యర్లకు మేలు జరిగేలా లేదు. మరి ఈ విషయంలో బయ్యర్లందరూ కలిసి తమకు కూడా నష్టాలు రాకుండా విధివిధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది...!