తెలుగులో పలువురు దర్శకులకు దేవిశ్రీప్రసాద్ ఆస్థాన సంగీత విద్వాంసుడి వంటివాడు. సుకుమార్, కొరటాల శివ వంటి వారి చిత్రాలకు, ఇక దిల్‌రాజు తీసే పెద్ద చిత్రాలకు దేవిశ్రీ కంపల్సరీ. ఈ జాబితాలోకి నిన్నటి వరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చేవాడు. ఆయన దర్శకునిగా మంచి ఫేమ్‌లోకి వచ్చిన తర్వాత 'ఖలేజా' తప్ప అన్ని చిత్రాలకు దేవిశ్రీనే పెట్టుకునేవాడు. తనదైన స్టైల్‌లో మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లడం త్రివిక్రమ్ స్టైల్. ఇక తాను ఎక్కడ ఉన్నా వాతావరణాన్ని ఖుషీగా, ఎనర్జీతో నింపేసి, తనదైన రాక్‌స్టార్ బిహేవియర్‌ని చూపించడం దేవిశ్రీ నైజం. ఇక త్రివిక్రమ్- దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో 'జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి' వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి.
సినిమా కంటెంట్ ఇతర విషయాలలో కాస్త తేడా వచ్చినా తన పాటలు, బ్యాగ్రౌండ్‌తో ఆ సీన్‌ని ఎలివేట్ చేయడంలో దేవిశ్రీ సిద్దహస్తుడు. కానీ త్రివిక్రమ్ తాను తీసిన 'అ...ఆ' చిత్రానికి మొదట అనిరుధ్‌ని పెట్టుకున్నాడు. చిన్న సినిమా కదా...! దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నాడేమో.. లేక మొనాటనీని ఛేదించేందుకు త్రివిక్రమ్ అనిరుధ్‌ని పెట్టుకున్నాడేమో అని అందరూ భావించారు. కానీ ఆ చిత్రానికి అనిరుద్ చివరలో హ్యాండిచ్చాడు. అయినా కూడా త్రివిక్రమ్ మిక్కీ.జెమేయర్‌తో పనికానిచ్చేశాడు. తనని చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టిన అనిరుధ్‌ని ఇక పట్టించుకోడేమో అని భావించారు. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను పవన్‌కళ్యాణ్‌తో తీస్తున్న చిత్రానికి మరలా అనిరుధ్‌నే పెట్టుకున్నాడు. మరోవైపు తాను తదుపరి చేయబోయే ఎన్టీఆర్ చిత్రానికి కూడా అనిరుధే సంగీత దర్శకుడని తేల్చేశాడు.
అంతేకాదు.. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే రోజునే కమల్‌హాసన్ బర్త్‌డే జరిగింది. దేవిశ్రీ కమల్‌కి శుభాకాంక్షలు చెప్పాడే గానీ త్రివిక్రమ్ సంగతి పక్కనపెట్టేసి కనీసం బెస్ట్ విషెష్ కూడా చెప్పలేదు. దాంతో వీరిమద్య తేడాలొచ్చాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక వీరిద్దరి మధ్య తేడాలు రావడానికి పవన్ కూడా కారణం అనే వాదన వినిపిస్తోంది. కంటెంట్ యావరేజ్‌గా ఉన్న 'జల్సా'ని దేవిశ్రీ మరో లెవల్‌కి తీసుకెళ్లినట్లే పవన్ అదే పనిగా దేవిశ్రీ వద్దకు వెళ్లి తన 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కి అదిరిపోయే ఆల్బమ్, రీరికార్డింగ్‌ని ఇవ్వమని కోరినా దేవిశ్రీ లైట్‌గా తీసుకున్నాడని, దాంతోనే దేవిశ్రీని పక్కనపెట్టమని తన స్నేహితుడైన త్రివిక్రమ్‌కి పవన్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇవి ఎంత వరకు నిజమో తెలియదు గానీ సినిమాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ఒకనాడు కృష్ణ, ఎస్పీబాలుకి తేడాలు వచ్చాయి. ఇక దేవిశ్రీకి బోయపాటితో బేధాలొచ్చినా మరలా కలిసిపోయారు. ఇలాగే త్రివిక్రమ్, దేవిశ్రీలు కూడా భవిష్యత్తులో కలిసి చేస్తారనే భావిద్దాం....!